Site icon vidhaatha

మెసేజులు పంపి వేధిస్తున్నారు.. హీరోయిన్ చాందినిచౌదరి

తెలుగు హీరోయిన్‌కు సోషల్ మీడియాలో వేధింపులు!

విధాత: మన తెలుగు అమ్మాయిలు కాస్త భయస్తులు, స్లోగా ఉండే వ్యక్తులని చెప్పాలి. అదే బాలీవుడ్ వారి విషయానికి వస్తే వారు దేనికైనా సై అంటే సై అంటారు. అందుకే వారు గ్లామర్ షో విషయంలో కూడా పట్టింపు లేకుండా వరుస అవకాశాల‌తో.. అన్ని భాషల్లోనూ విజయాలు సాధిస్తూ ముందుకు సాగి పోతున్నారు. వాళ్లకి ఇష్టం లేని వేధింపులు, ఇతర కామెంట్స్ వస్తే ముందు వెనక చూడరు. కానీ మన తెలుగు అమ్మాయిల పరిస్థితి అది కాదు. అందునా సాంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలు హీరోయిన్లుగా రాణించడం కష్టమే. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

ఇక విషయానికొస్తే చాందిని చౌదరి అనే తెలుగు నటి ఉంది. ఈమె 1991లో విశాఖపట్నంలో జన్మించింది. కాకపోతే విద్యాభ్యాసమంతా బెంగళూరులో జరగడం వల్ల సినిమాల్లో ఎంట్రీ చేసింది. బెంగళూరులో చదువుకుంటున్న రోజుల్లోనే షార్ట్ ఫిలిమ్స్‌లో నటించింది. ఇలా పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించిన తర్వాత లఘు చిత్రాల నుంచి ఆమె వెండితెరపై దృష్టి సారించింది.

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్’ చిత్రాలలో చిన్న పాత్రలలో నటించింది. 2013లో వచ్చిన ‘మధురం’ అనే లఘు చిత్రంలో ఆమె నటన చూసి వర ముళ్ళపూడి, కె.రాఘవేంద్రరావు ‘కుందనపు బొమ్మ’ అనే చిత్రంలో అవకాశం ఇచ్చారు. కానీ ఈ చిత్రం రెండేళ్ల గ్యాప్ తర్వాత 2015లో ప్రారంభమైంది. అంతకు ముందే ఆమె ‘కేటుగాడు’ అనే చిత్రంతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైంది.

ఆ తర్వాత బ్రహ్మోత్సవం, కుందన బొమ్మ, శమంతకమణి, లై, హౌరా బ్రిడ్జ్, మను, కలర్ ఫోటో, గామి వంటి చిత్రాలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా ఆమె నటిస్తోంది. ఈమె మొదట్లో హీరో రాజ్ తరుణ్‌తో కూడా పలు లఘు చిత్రాలలో నటించి మెప్పించింది.

ఆమె నటించిన ‘కలర్ ఫోటో’ అనే చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకుని రావడమే కాదు ఈ మూవీకి జాతీయ అవార్డు కూడా లభించింది. అలా ఓ అవార్డు చిత్రంలో నటించిన ఆమె..ఆ తర్వాత ‘సమ్మతమే’ సినిమాతో అలరించింది. ప్రస్తుతం యంగ్ హీరో నవదీప్ తన మిత్రుడితో కలిసి నిర్మిస్తున్న సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది చాందిని చౌదరి. అయితే ఈ భామకి ఇప్పుడు వేధింపులు ఎక్కువయ్యాయని తెలుస్తుంది.

సోషల్ మీడియా వాడకం అనేది ఎంత పెరిగితే అంతగా నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. సెలబ్రిటీలు కూడా వేధింపులకు గురవుతున్నారు. సైబర్ నేరగాళ్ల చేతుల్లో చాలా తేలిగ్గా మోసపోతున్నారు. ఇక హీరోయిన్లు ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో తమ అకౌంట్ హ్యాక్ అయిందంటూ.. వేధింపులకు పాల్పడుతున్నారని ఇప్పటికే పలువురు నటీనటులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం చూశాం.

ఇటీవలే యాంకర్ కం యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్‌ని వేధిస్తున్న వ్యక్తిని.. అలాగే హీరోయిన్ పార్వతి నాయర్ మీద ఆరోపణలు చేసిన వాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి తనను గుర్తుతెలియని కొందరు వ్యక్తులు వేధిస్తున్నారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చాందిని ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేక్షకులతో షేర్ చేసుకుంది. గత కొన్ని నెలల నుంచి అంతర్జాతీయ నెంబర్స్ ఉపయోగించి కొంతమంది వ్యక్తులు స్కాంకి పాల్పడుతున్నారు. వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడానికి మా పేర్లు వాడుకుంటూ వాట్సప్‌లలో మెసేజీలు పంపిస్తున్నారు.

అంతటితో ఆగకుండా వేధింపులకు కూడా పాల్పడుతున్నారు. ఇలా నన్నేకాదు నా కోస్టార్స్ పేర్లు, ఫోటోలు కూడా వాడుతున్నారు. మీలో ఎవరికైనా ఇలాంటి మెసేజులు వస్తే దయచేసి రిపోర్ట్ చేయండి. మీ వివరాలు వారితో షేర్ చేసుకోకండి.. అంటూ తన ఇన్‌స్టాగ్రమ్ స్టోరీస్‌లో స్క్రీన్ షాట్స్ షేర్ చేసింది చాందిని చౌదరి.

Exit mobile version