విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: విధాత: ఈనెల 26, 27, 28 తేదీల్లో పర్వతగిరిలోని పర్వతాల శివాలయం పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. అధిక సంఖ్యలో తరలివచ్చి శివుడికి అభిషేకం చేసి, దర్శనం చేసుకుని, తన ఇంట్లో భోజనం చేసి వెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళలను ఆహ్వానించారు.
పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్లలో మంగళవారం కుట్టుమిషన్ల శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. బిజెపి, కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలు తిరిగి వచ్చాను. మన దగ్గర అమలయ్యే పథకాలు అక్కడ ఎక్కడా లేవు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కొన్ని ఉన్నాయన్నారు.
మహిళా సంఘాల మంత్రిగా మీకు మేలు చేసే అవకాశం ఇచ్చారు. కుట్టు మిషన్ల పథకం బాగుంది అని సీఎం కేసీఆర్ ప్రశంసించారని తెలిపారు. ఈ పథకంలో ఒక్కొక్కరికి 17వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. మొదటగా పాలకుర్తిలోనే పెట్టాం. ఈ పథకం కింద పాలకుర్తి నియోజకవర్గంలో 3వేల మందికి శిక్షణ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.
అందరూ నన్ను దయన్న అని ప్రేమగా పిలుస్తారు. అందుకే మహిళలు పైకి రావాలి అన్నదే నా లక్ష్యమని, పాలకుర్తి, బమ్మెర, వల్మిడీ చుట్టూ ఉన్న ఆలయాలను అభివృద్ధి చేసి టూరిజం కేంద్రంగా మారుస్తామని మంత్రి హామీనిచ్చారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, డి. ఆర్. డి. ఏ రామ్ రెడ్డి, డీసీసీబీ వైస్ ప్రెసిడెంట్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ జ్యోతి, AMC చైర్మన్ రాము, సర్పంచ్ బిందు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.