Site icon vidhaatha

Red Alert | మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు.. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ

Red Alert

విధాత: మంగళవారం నుండి మూడు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుండి భారీ, అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో అతి భారీ వర్షాలు ఉంటాయని పేర్కొన్నది. రాయలసీమ, కోస్తాంధ్రలో పలు చోట్ల కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్, రెడ్‌ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించింది.

కాగా సోమవారం నుండే వర్షాలు జోరందుకోగా, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు చోట్ల రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో వాహనాదారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు పలు మార్గాలలో ట్రాఫిక్ మళ్లీంపు చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల నిమిత్తం రంగంలోకి దిగాయి.

మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు

మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మంగళవారం నుండి మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించవచ్చని తెలిపింది. తెలంగాణలో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాది భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుండి భారీ వర్షాలు పడనున్నాయి. మహబూబ్‌బాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 40నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ నివేదిక తెలిపింది.

బంగాళాఖాతంలో దక్షిణ-ఒడిస్సా ప్రాంతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్ ల సమీపంలో వాయవ్య, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో భారీ వర్షాలు పడనున్నాయని వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలలో కురిసిన వర్షాలతో తెలంగాణలో గోదావరి, మంజీర, బీమా, పెన్నా నదులతో పాటు ఇతర వాగులు, వంకలు ఉప్పొంగగా.. తాజా వర్షాలతో మరింత వరద పోటు తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజలను, జిల్లా, మండల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. వరద సహాయక చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.

Exit mobile version