చోరీకి వ‌చ్చిన వారి కారే దొంగ‌త‌నానికి గురైంది.. అమెరికాలో వింత ఘ‌ట‌న‌

ఎంతో పక్కా ప్ర‌ణాళిక‌తో ప్రొఫెష‌న్‌ల్‌గా దొంగ‌త‌నాలు (Crazy Heist) చేసేవారికి అప్పుడ‌ప్పుడూ అనుకోని ఘ‌ట‌న‌లు ఎదుర‌వుతూ ఉంటాయి

  • Publish Date - December 18, 2023 / 09:30 AM IST

విధాత‌: ఎంతో పక్కా ప్ర‌ణాళిక‌తో ప్రొఫెష‌న్‌ల్‌గా దొంగ‌త‌నాలు (Crazy Heist) చేసేవారికి అప్పుడ‌ప్పుడూ అనుకోని ఘ‌ట‌న‌లు ఎదుర‌వుతూ ఉంటాయి. అవి వారిని పోలీసుల‌కు దొరికిపోయేలా చేయ‌డంతో పాటు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తాయి. అలాంటి ఒక విచిత్ర ఘ‌ట‌న అమెరికా (America) లోని కొల‌రాడోలో చోటు చేసుకుంది. ఇక్క‌డి కామ‌ర్స్ సిటీ అనే ప్రాంతంలో ఓ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీస్ సెంట‌ర్‌లో దొంగ‌త‌నం చేయ‌డానికి శ‌నివారం ఉద‌యం ముగ్గురు వ్య‌క్తులు చేరుకున్నారు.


కాగా.. వారు లోప‌ల‌కు వెళ్లి క్యాష్ కౌంట‌ర్‌లో దొంగ‌త‌నం చేస్తుండ‌గా.. నాలుగో వ్య‌క్తి ఈ ముగ్గురు దొంగ‌లు వేసుకొచ్చిన కారును దొంగ‌లించి పారిపోయాడు. ఆ ముగ్గురు దొంగ‌లు చోరీ చేసుకుని పారిపోదామ‌ని బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్ప‌టికి అక్క‌డ కారు లేదు. దీంతో వారు అక్క‌డే ఉండిపోవ‌డం.. ఎవ‌రో పోలీసులకు స‌మాచారం ఇవ్వ‌డం.. వారు ఈ ముగ్గురునీ అదుపులోకి తీసుకోవ‌డం జ‌రిగిపోయాయి. దీనిపై కామ‌ర్స్ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.


‘ఇది ఒక అనుకోని అరుదైన న‌వ్వొచ్చే ఘ‌ట‌న‌.. లోప‌ల ముగ్గురు క‌లిసి దొంగ‌త‌నం చేస్తుండ‌గా.. బ‌య‌ట ఉన్న నాలుగో దొంగ వారు పారిపోవ‌డానికి సిద్ధంగా ఉంచిన కారును దొంగ‌లించాడు. దానికి సంబంధించిన వివ‌రాలు తెలియ‌లేదు.. తెలిస్తే ఇక్క‌డ పంచుకుంటాం’ పోలీసులు ఒక ట్వీట్ చేశారు. కారును దొంగ‌లించిన నిందితుడికి.. లోప‌ల‌కు వెళ్లిన ముగ్గురు దొంగ‌ల‌కు సంబంధం ఉందా లేదా అనే దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంద‌ని ఒక పోలీసు అధికారి తెలిపారు.


అలాగే ఇప్పుడు దొంగ‌త‌నానికి గురైనా కారు కూడా.. ఇప్ప‌టికే ఒక సారి చోరీకి గురైన‌దేన‌ని భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ప‌ట్టుబ‌డిన ముగ్గురు వ్యక్తుల‌ను విచారిస్తున్నామ‌ని.. దర్యాప్తు కొన‌సాగుతోంద‌ని తెలిపారు. శ‌నివారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు ఆదివారం వివ‌రాలు వెల్ల‌డించారు. ఆ నాలుగో వ్య‌క్తి కోసం గాలింపు కొన‌సాగుతోంద‌ని.. ఎవ‌రికైనా వివ‌రాలు తెలిస్తే కామ‌ర్స్ సిటీ పోలీసులకు సమాచారం ఇవ్వాల‌ని ఎక్స్‌లో విజ్ఞ‌ప్తి చేశారు.