Site icon vidhaatha

Hyderabad | రెండు నెలల నుంచి జీతాలు రావడం లేదని.. హోంగార్డు ఆత్మహత్యాయత్నం

Hyderabad |

విధాత‌, హైదరాబాద్: రెండు నెలల నుంచి జీతాలు రావడం లేదని మనస్థాపం చెందిన ఓ హోంగార్డు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన గోశామహల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. హోంగార్డు రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు.

కాగా.. ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడడంతో పలుమార్లు ఉన్నతాధికారులను కలిసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మనస్థాపం చెందిన రవీందర్ గోషామహల్‌లోని హోంగార్డుల హెడ్ ఆఫీస్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

ఇది గమనించిన అక్కడే ఉన్న వారు వెంట‌నే మంటలను ఆర్పివేసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రవీందర్‌కు 55శాతం గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. హోంగార్డు రవీందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

హోంగార్డుల నిరసన హోరు.. సహచరుడి ఆత్మహత్య యత్నంతో ఆందోళన

గోషామహల్ హోంగార్డు కమాండెంట్ ఆఫీస్ ఎదురుగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నం చేసుకున్న హోంగార్డు రవిందర్ ఘటన సహచర హోంగార్డులలో ఆగ్రహావేశాలను రగిలించింది. సకాలంలో వేతనాలు రాకపోతుండటంతో పాటు ఉద్యోగాల రెగ్యులైజేషన్ కావడం లేదన్న నిరాశతో రవిందర్ ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడన్న వాదన పోలీస్ శాఖలో కలకలం రేపింది.

ఈ ఘటనపై తమ నిరసన వ్యక్తం చేసేందుకు హోంగార్డుల జెఏసీ సంఘం పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా విధులను బహిష్కరించిన హోంగార్డులు బుధవారం రవిందర్ చికిత్స పొందుతున్న ఉస్మానియా ఆసుపత్రి వద్ధ నిరసనకు దిగారు. హోంగార్డుల ఉద్యోగాలను రెగ్యులైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

Exit mobile version