ఉపాధి, వ్యవస్థాపక అవకాశాలను అందించడంలో హార్టికల్చర్ ముఖ్య పాత్ర

కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ తమిళిసై సౌందరరాజన్ విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: ఉపాధి, వ్యవస్థాపక అవకాశాలను అందించడంలో హార్టికల్చర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలంగాణ గవర్నర్, కొండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం రెండవ సాధనోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను, పీహెచ్డీ చేసిన వారికి డాక్టరేట్ […]

  • Publish Date - December 24, 2022 / 01:06 AM IST

కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ తమిళిసై సౌందరరాజన్

విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: ఉపాధి, వ్యవస్థాపక అవకాశాలను అందించడంలో హార్టికల్చర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలంగాణ గవర్నర్, కొండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం రెండవ సాధనోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను, పీహెచ్డీ చేసిన వారికి డాక్టరేట్ పట్టాలను అందజేశారు.

అనంతరం విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించే వంగడాల ఉత్పత్తి లక్ష్యంగా పరిశోధనలు నిర్వహించాలని ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఉద్యాన రంగం వ్యవసాయ రంగానికి మూల స్తంభం లాంటిదని, ఎలాంటి అనారోగ్యాలు లేకుండా గత తరం మనుషులు ఎలాంటి ఆహారం తీసుకొని ఆరోగ్యవంతంగా బతికారో అలాంటి ఆరోగ్యవంతమైన పంటలను పండించడానికి ఉద్యాన విద్యార్థులు విస్తృతమైన పరిశోధనలు జరపాలని అన్నారు.

గతంలో వివిధ రకాలైన వరి ధాన్యాలను వివిధ సందర్భాల్లో ఆహారంగా తీసుకునే వాళ్ళు కానీ ప్రస్తుతం పాలిష్ చేసిన వరి బియ్యంతో చేసిన వంటలను ఆహారంగా తీసుకోవడం మూలంగా శరీరానికి అవసరమైన ప్రోటీన్లను పొందలేకపోతున్నామని, కరోనా వైరస్ పౌష్టికాహారం విలువను ప్రపంచానికి తెలిపిందన్నారు. మానవాళికి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించే వంగడాల సృష్టి జరిగేలా ఉద్యాన విద్యార్థులు నిరంతరం పరిశోధనలు నిర్వహించాలి. శాకాహారం, పండ్లు, పూల వలన మానవాళికి జరిగే లాభాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు.

నెగిటివ్ ఆలోచనలు మాని పాజిటివ్ గా ఆలోచించి విశ్వవిద్యాలయంలో కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని సమాజ శ్రేయస్సుకు ఉపయోగ పడేలా నైపుణ్యాన్ని సాధించాలని ఈ సందర్భంగా గవర్నర్ విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ నీరజ ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయం 8 సంవత్సరాల వ్యవధిలో సాధించిన విజయాలను, విద్యార్థులకు అందజేసిన కోర్సుల వివరాలను, జరిగిన పరిశోధనలను వివరించారు.

భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (హార్టికల్చర్) డా. ఆనంద్ కుమార్ సింగ్ మాట్లాడుతూ దేశంలో సగం జనాభా వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉందని వ్యవసాయ రంగానికి ఉద్యాన పంటలు తోడైనప్పుడు మాత్రమే రైతులు అభివృద్ధి సాధిస్తారని అన్నారు. దేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉద్యాన పంటల పండించే జాబితాలో ఉందని ప్రభుత్వం సమీకృత ఉద్యాన వన అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.