Site icon vidhaatha

ఉమ్మ‌డి అనంత వైసీపీలో భారీ మార్పులు!


విధాత ప్ర‌తినిధి (అమ‌రావ‌తి)


ఏప్రిల్‌కు ముందే ఏపీ రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. వైనాట్ 175 నినాదంతో వైఎస్ జ‌గ‌న్ వేగంగా పావులు క‌దుపుతున్నారు. మొద‌టి విడ‌త‌లోనే 11 మంది సిట్టింగుల‌కు నో టికెట్ అని తేల్చేసిన జ‌గ‌న్‌, రెండో విడుత‌లో మ‌రో 15 మందిపై వేటు వేయ‌డానికి సిద్ధ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాకు సంబంధించి ప‌లువురు సిట్టింగుల‌కు ఈసారి మొండిచేయి చూపించిన‌ట్లు తెలుస్తోంది.


పెనుకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంక‌ర నారాయ‌ణ స్థానంలో క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉష‌శ్రీ చ‌ర‌ణ్‌ను పోటీ చేయించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది. దీంతో శంక‌ర‌నారాయ‌ణ వ‌ర్గీయులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. క‌దిరి సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి స్థానంలో వ్యాపారి మ‌క్బూల్ పేరు ఖ‌రారు చేయ‌డంతో సిద్ధారెడ్డి వ‌ర్గీయులు మూకుమ్ముడి నిర‌స‌నకు దిగారు. క‌ళ్యాణ‌దుర్గంలో అనంత‌పురం ఎంపీ రంగ‌య్య‌ను కానీ, కొత్త‌వారికికానీ అవ‌కాశం క‌ల్పించాల‌న్న ఆలోచ‌న చేస్తున్నారు.


రాయ‌దుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డి స్థానంలో మెట్టు గోవిందురెడ్డి పేరు ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలుస్తోంది. శింగ‌న‌మ‌ల సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి మాల సామాజిక‌వ‌ర్గం, ఆమె స్థానంలో మాదిగ సామాజిక‌వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి శ‌మంత‌క‌మ‌ణినిగానీ, ఆమె కుమార్తె యామినీబాల‌నుకానీ, డిఎస్పీ శ్రీ‌నివాసులు పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. మ‌డ‌క‌శిర సిట్టింగ్ అభ్య‌ర్థి తిప్పేస్వామి స్థానంలో మ‌రో పోలీసు అధికారి శుభ‌కుమార్ పేరు ప్ర‌తిపాద‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.


వివాదాస్ప‌ద వ్యాఖ్యలు, వీడియోల‌తో ప‌లుసార్లు మీడియాకు ఎక్కిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌కు ఈసారి అటు ఎంపీగాకానీ, ఎమ్మెల్యేగాకానీ అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని స‌మాచారం. దీంతో ఆయ‌న తాడేప‌ల్లిలో జ‌గ‌న్‌ను క‌లిసి త‌న‌కు మ‌రో అవ‌కాశం ఇవ్వాల‌ని అభ్య‌ర్థించార‌ని, కానీ జ‌గ‌న్ మాత్రం మొహం మీదే నో చెప్పార‌ని అంటున్నారు. హిందూపురం ఎంపీగా ఈసారి బోయ సామాజిక వ‌ర్గానికి చెందిన వారి పేరు వైసీపీ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని చెబుతున్నారు.

Exit mobile version