విధాత: ప్రత్యేక వివాహ చట్టం కింద స్వలింగ వివాహాన్ని గుర్తించాలని కోరుతూ ఇద్దరు వ్యక్తులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక వివాహ చట్టం, 1954 ప్రకారం స్వలింగ వివాహాన్ని గుర్తించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కులు సుప్రీంకోర్టులో శుక్రవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం( PIL) దాఖలు చేశారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం దీనిపై విచారణ జరపనున్నారు. స్వలింగ జంటల మధ్య వివక్ష చూపే ప్రత్యేక వివాహ చట్టం భారత రాజ్యాంగానికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇది స్వలింగ జంటలకు చట్టపరమైన హక్కులతో పాటు సామాజిక హక్కులను నిరాకరిస్తోందని, వివాహం ద్వారా సమాజంలో వచ్చే గుర్తింపు, హోదాకు భంగమని కూడా వాదిస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన గే జంట సుప్రియో చక్రవర్తి , అభయ్ డాంగ్‌లు దాదాపు 10 సంవత్సరాలుగా జంటగా కలిసి ఉంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో వారిద్దరికీ COVID వచ్చింది. ఆ సమయంలో వారి ఇరు కుటుంబాలు కూడా వారికి దగ్గరయ్యాయి.
కోవిడ్ నుంచి ఈ గే జంట కోలుకున్న తర్వాత, 9వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి సంబంధాన్ని స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులకు షేర్ చేస్తూ వివాహ-కమిట్‌మెంట్ వేడుకను నిర్వహించాలని నిర్ణయించుకుని. 2021 డిసెంబర్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలకు ఇద్దరి తల్లిదండ్రులతో పాటు, ఇరు కుటుంబాల నుంచి బంధువులు, స్నేహితులు కూడా హాజరై ఆశీర్వదించారు.
ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం స్వలింగ జంటలు, సహజ వివాహ జంటల మధ్య వివక్ష అతి స్వల్పంగా మాత్రమే ఉందని, స్వలింగ జంటలకు చట్టబద్ధమైన హక్కులతో పాటు సామాజిక హక్కులను కూడా నిరాకరించడాన్ని అడ్డుకోవాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు.
వివాహం ద్వారా వచ్చే గుర్తింపు, హోదా ఎవరికైనా సమానంగా ఉండాలని, కులాంతర, మతాంతర జంటలు తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కును భారత సర్వోన్నత న్యాయస్థానం ఎల్లప్పుడూ పరిరక్షించాలని పిటిషనర్లు వాదించారు.
లెస్బియన్, గే, బైసెక్సువల్ , ట్రాన్స్‌జెండర్(LGBTQ) వ్యక్తులకు రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వం, గౌరవం, గోప్యతకు సమానమైన హక్కులు ఉంటాయని నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ పుట్టస్వామి కేసులలో సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించారు. తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు LGBTQ పౌరులకు కూడా కల్పించాలని కోరారు.
ప్రత్యేక వివాహ, విదేశీ, హిందూ వివాహ చట్టాల కింద ఈ వివాహాలను గుర్తించాలని కోరుతూ ఢిల్లీ, కేరళ హైకోర్టుల్లో ప్రస్తుతం 9 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ తరహా అన్ని రిట్ పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయడానికి మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోందని ఈ నెల మొదటి వారంలో, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కేరళ హైకోర్టు ముందు ప్రకటించారు.
సుప్రీయో జంట తరఫున న్యాయవాదులు అరుంధతీ కట్జూ, ప్రియా పూరి, సృష్టి బోర్తకూర్లు ఈ పిల్‌ను వేశారు. సీనియర్ న్యాయవాదులు నీరజ్ కిషన్ కౌల్, మేనకా గురుస్వామిలు ఈ కేసులో వాదించనున్నారు.
కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..
ప్రత్యేక వివాహ చట్టం కింద స్వలింగ వివాహాలను నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వంతో పాటు భారత అటార్నీ జనరల్‌కు వేర్వేరుగా నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా దీనిపై సమాధానం చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం ఆ నోటీసుల్లో కోరింది.