విధాత: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఐక్యంగా పని చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హిత బోధ చేశారు. రెండు రోజుల పర్యటన కోసం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీగా హైదరాబాద్‌కు మొదటి సారి వచ్చిన థాక్రే గాంధీ భవన్‌లో ఏఐసీసీ నేతల నుంచి మొదలు కొని జిల్లా స్థాయి నేతల వరకు అందరితో విడివిడిగా మాట్లాడారు.
వాళ్లు చెప్పిన వన్నీ విన్న థాక్రే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏమి చేయాలని ప్రశ్నించారు. మీరంతా విడివిడిగా ఉంటే ప్రజల అభిమానాన్ని చురగొనడం కష్టమని తేల్చి చెప్పారు. ముందు అందరూ విభేదాలు వీడి కలిసి పని చేయండని సూచించారు. మీ సమస్యలన్నీ విన్నాను.. అన్ని పరిష్కారం అవుతాయని నేతలకు హితబోధ చేసినట్లు సమాచారం.
అధికారంలోకి రావాలని ఉందా? లేదా?- నేతలను ప్రశ్నించిన థాక్రే…
అయితే పీసీసీని ప్రక్షాళన చేయాలని సీనియర్ నేతలు పట్టుబట్టినట్లు తెలిసింది. మీకు అధికారం కావాలా? పీసీసీ ప్రక్షాళన కావాలా? అని థాక్రే సీనియర్ నేతలను ప్రశ్నించినట్లు సమాచారం. ముందు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పని చేయండి.. అది మాని మనలో మనం తగవులాడుకొని బజారున పడితే అధికారంలోకి ఏలా వస్తామో చెప్పండని థాక్రే నేతలను అడిగినట్లు తెలిసింది. ఇప్పటికే 8 ఏండ్లకు పైగా అధికారానికి దూరంగా ఉన్నాం.. ఇంకా మీకు అధికారంలోకి రావాలని ఉందా? లేదా? అని అడిగినట్లు తెలిసింది.
పదవితో పని లేదు.. అంతా సమానమే!
ఇప్పటికే పార్టీ నుంచి గెలిచిన నేతలను బీఆర్ ఎస్ కొనుగోలు చేసింది. మరో వైపు తెలంగాణపై బీజేపీ కేంద్రీకరించింది. పార్టీ నేతలకు గాలాలు వేస్తున్నది. ముందు పార్టీని కాపాడుకోవాలి. పార్టీ ఉంటేనే మనమంతా ఉంటాం. కొంత మంది నేతలు పార్టీ మారి బీజేపీలోకి వెళ్లినా వారికి ఏస్థానం ఇచ్చారో మీకందరికి తెలుసు.. అందరికి అధ్యక్షపదవులు రావు.. అలాగని అధ్యక్ష పదవి ఉన్నంత మాత్రానా ఏదో కిరీటం ఉన్నట్లుగా కాదు.. పార్టీకి అందరూ సమానమే.. కలిసి కట్టుగా జట్టు కట్టి పోరాడితే అధికారం మనకే వస్తుంది… అని థాక్రే నేతలకు హితభోద చేసినట్లు సమాచారం. పీసీసీ పదవి లేకపోయినా అందరిని గౌరవిస్తామని థాక్రే నేతలతో అన్నట్లు తెలిసింది. ఈ మేరకు ఇటీవల పార్టీ మారిన మునుగోడు ఎమ్మెల్ల్యే పరిస్థితి ఏమైందో వివరించినట్లు సమాచారం.
పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి..
తెలంగాణలో కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులున్నాయని పలు సర్వేలు తెలియ జేస్తున్నాయని నేతలకు తెలిపినట్లు సమాచారం. అనుకూలంగా ఉన్న పరిస్థితిని ఉపయోగించుకొని పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడాలని అన్నట్లు తెలిసింది. దాదాపు 70కి పైగా నియోజకవర్గాలలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉందని నేతలకు చెప్పినట్లు తెలిసింది. మిగతా నియోజకవర్గాలలో గట్టి పోటో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్యనే ఉంటుందని చెప్పినట్లు సమాచారం. బీజేపీ10 నియోజకవర్గాలలో కూడ బలం చూపించలేదని నేతలతో థాక్రే అన్నట్లు తెలిసింది.
సొంత బలం లేకనే మన నేతలకు గాలాలు..
బీజేపీ నేతలకు బలం లేకనే మన పార్టీ నేతలకు డబ్బులు ఎరవేసి కొనుగోలు చేయాలని చూస్తున్నారని, వారి ట్రాప్‌లో పడితే మీకే నష్టమని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హిత బోధ చేసినట్లు సమాచారం. మన ఓట్లు చీలిపోయి తిరిగి బీఆర్ఎస్‌కే లబ్ది జరుగుతుందని, దీంతో అధికారం మీకు అందనంత దూరం పోతుందని హెచ్చరించినట్లు తెలిసింది. మీకు అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయడం కావాలా? లేదా తాత్కాలిక ప్రయోజనాలు కావాలో మీరే నిర్ణయించుకోమని అన్నట్లు సమాచారం.
బీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది.. అనుకూలంగా మార్చుకోండి
బీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని రైతులకు, ప్రజలకు దూరమైందని, ధరణి పోర్టల్ పట్ల రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని థాక్రే నేతలకు చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వంపై ప్రజా ఆగ్రహాన్ని పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని, ప్రజాక్షేత్రంలో నేతలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని హితో బోధ చేసినట్ల సమాచారం.
హాథ్ సే హాథ్ జోడో యాత్రను విజయవంతం చేయండి
దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీచేపట్టిన జోడో యాత్ర విజయవంతం అయిందని చెప్పిన థాక్రే రాహుల్ సందేశాన్ని ప్రతి గ్రామానికి చేరవేయడానికి ఈనెల 26 నుంచి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేయాలని ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో నేతలంతా కలిసి విజయవంతం చేయాలని థాక్రే హితబోధ చేశారు. కలహాలు మాని కలిసి కట్టుగా పనిచేయాలని నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రతి ఇంటికి రాహుల్ సందేశం
హాథ్ సే హాథ్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ సందేశాన్ని దేశంలో ప్రతి ఇంటికి చేరవేర్చాలనే లక్ష్యంతో చేపడుతున్నామన్నారు, ఈ యాత్ర జనవరి 26 నుంచి రెండు నెలలపాటు హాథ్ సే హాథ్ జోడో యాత్ర కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణలో ప్రతి ఇంటికే రాహుల్ గాంధీ సందేశాన్ని చేర వేయాలన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రకు మద్దతుగా అంతా కలిసిరావాలని పిలుపు ఇచ్చారు.
ఈయాత్ర ప్రతి జిల్లా, ప్రతి బ్లాక్ లో రెండు నెలలపాటు కొనసాగుతుందని తెలిపారు. ప్రతి ఇంటికి భారత్ జోడో యాత్ర పోస్టర్, ప్రతి చేతికి రాహుల్ గాంధీ సందేశాన్ని చేర్చే విదంగా హాథ్ సే హాథ్ అభియాన్ యాత్ర సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త,నాయకులు పాల్గొనాలన్నారు.
ఎన్నికలకు సమాయత్తం చేసేందుకే సమావేశం: రేవంత్
తెలంగాణ కాంగ్రెస్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకే ఈ సమావేశం నిర్వహించారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. థాక్రే ముంబై బాంబు బ్లాస్ట్, మతకల్లోలాలు జరిగిన సమయంలో హోం మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో హోంమంత్రిగా ఠాక్రే ఎంతో సమర్థవంతంగా పని చేశారని కితాబు ఇచ్చారు.
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు హోంమంత్రిగా జానారెడ్డిలా.. శరత్ పవార్ హయాంలో థాక్రే అంతటి సమర్థ వంతంగా పని చేశారన్నారు. సమస్యలను పరిష్కరించడంలో తనదైన శైలి ప్రదర్శిస్తారని ఆయనకు గుర్తింపు ఉందన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్ర నేపథ్యంలో పార్టీలో అందరితో ఆయన మాట్లాడారన్నారు. 21న మరోసారి ధాక్రే రాష్ట్రంలో పర్యటించి పూర్తి స్థాయిలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర కమిటీలను ప్రకటిస్తారని తెలిపారు.