ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ అప్పగింతలో కీలక అప్‌డేట్‌

లష్కరే తాయిబా చీఫ్‌, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను తమకు అప్పగించాలని పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని భారత్‌ లాంఛనంగా కోరింది.

  • Publish Date - December 28, 2023 / 08:41 AM IST
  • పాకిస్థాన్‌ను లాంఛనంగా కోరిన భారత్‌
  • లేఖ రాసిన విదేశీ వ్యవహారాల శాఖ!

న్యూఢిల్లీ: లష్కరే తాయిబా చీఫ్‌, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను తమకు అప్పగించాలని పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని భారత్‌ లాంఛనంగా కోరింది. ఈ మేరకు న్యాయపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ విదేశాంగ శాఖ అధికారులు ఆ దేశ అధికారులకు లేఖ రాసినట్టు తెలిసింది. భారత దేశపు మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో హఫీజ్‌ ఒకడు. 2008 ముంబై దాడులకు సంబంధించి ఇతడి ఆచూకీ తెలిపినవారికి పది లక్షల డాలర్లు ఇస్తామని అమెరికా కూడా ప్రకటించింది.

ముంబై దాడుల కేసులో విచారణను ఎదుర్కొనేందుకు గాను అతడిని అప్పగించాలని భారత్‌ చాలా కాలంగా పాకిస్థాన్‌ను డిమాండ్‌ చేస్తూ వస్తున్నది. అయితే.. నేరస్తుల అప్పగింతకు సంబంధించి భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఒప్పందం ఏమీ లేకపోవడంతో ఈ ప్రక్రియ ముందుకు నడవడం లేదు. ముంబై దాడులతో తనకు సంబంధం లేదని, లష్కరేకు కూడా నాయకత్వం వహించడం లేదని హఫీజ్‌ సయీద్‌ చెప్పకొంటున్నాడు. కానీ.. ఆయనపై ఇన్నేళ్లలో అనేక కేసులో నమోదయ్యాయి. గతంలో 2019 జూలైలో పాకిస్థాన్‌ అతడిని తొలిసారి అరెస్టు చేసింది. గతేడాది ఏప్రిల్‌లో పాకిస్థాన్‌ కోర్టు అతడికి ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందించిన కేసులో 31 ఏళ్ల జైలు శిక్ష విధించినట్టు కొన్ని పత్రాలు పేర్కొంటున్నాయి.

కానీ.. అతడు జైల్లో ఉన్నాడా? బయట ఉన్నాడా? అన్న విషయంలో స్పష్టత లేదు. 2017లో హౌస్‌ అరెస్టు నుంచి విడుదలైన దగ్గర నుంచీ అతడు స్వేచ్ఛగా సంచరిస్తున్నాడని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. గత దశాబ్దకాలంలో అనేక మార్లు సయీద్‌ అరెస్టవడం, విడుదల కావడం జరిగిందని చెబుతున్నారు. గతేడాది హఫీజ్‌ సయీద్‌ కుమారుడు తల్హా సయీద్‌ను ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. పాకిస్థాన్‌లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్థాన్‌ మర్కజీ ముస్లిం లీగ్‌ (పీఎంఎంఎల్‌) తరఫున పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ పార్టీని స్థాపించింది కూడా ఆయన తండ్రి హఫీజ్‌ సయీదే.