Iran
విధాత: మహిళలపై ఉక్కుపాదం మోపడానికి ఇరాన్ (Iran) మరోసారి సిద్ధపడింది. డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించిన మహిళలకు 10 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్షను వేసేలా అనుమతించే బిల్లును ఆ దేశ పార్లమెంటు ఆమోదించింది. హిజాబ్ (Hijab) చట్టాలను ధిక్కరించే వారిని, వారికి అనుకూలంగా రోడ్ల మీదకు వచ్చే వారికి కూడా శిక్షలు విధించేలా ఈ బిల్లును రూపొందించారు. చాసిటీ అండ్ హిజాబ్ బిల్ అని పిలుస్తున్న ఈ చట్టాన్ని మూడేళ్ల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
దీని ప్రకారం హిజాబ్ ధరించని యువతులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. అంతే కాకుండా 3,651 డాలర్ల నుంచి 7,302 డాలర్ల వరకు జరిమానాను సైతం విధించవచ్చు. హిజాబ్ బ్యాన్‌ను సమర్థించేవారికి, ఆ పోరాటాలకు నిధులు అందించేవారికి, హిజాబ్‌ను వేళాకోళం చేసేవారికి, నగ్నత్వాన్ని సమర్థించే వారికి కూడా శిక్షలు విధించడానికి ఈ చట్టం అనుమతిస్తుంది.
ప్రస్తుతం చట్టసభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లు.. త్వరలోనే గార్డియన్ కౌన్సిల్ ముందుకు వెళ్లనుంది. ఇక్కడ ఆమోదం పొందిన అనంతరం ఈ చట్టం అమలులోకి వస్తుంది. సెప్టెంబరు 16, 2022న హిజాబ్ ధరించని కారణంగా మాసా అమీనా అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆమె కస్టడీలో మరణించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. యువతులు రోడ్ల పైకి వచ్చి తమ హిజాబ్‌లను తీసేసి నిరసన వ్యక్తం చేశారు. ఏడాది పాటు జరిగిన ఈ ఆందోళనల్లో 500 మంది ప్రాణాలు కోల్పోగా 22,000 మంది జైలు పాలయ్యారు. ఆ ఘటన జరిగి ఒక ఏడాది పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడం గమనార్హం.