ఉన్నమాట: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాసేపటి క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. జనరల్‌గా అర్జీవి రాజకీయ నాయకులను కలిసేది తక్కువే. ఏదైనా సినిమా తీయాలనుకుంటే ఇన్ ఫుట్స్, ఇతరత్రా సమాచారం కోసం ఆ సినిమా అవసరాన్నిబట్టి పోలీసులు, గ్యాంగ్ స్టర్స్ ఇతరత్రా ఎక్స్పర్ట్స్ ను ఆయన కలుస్తుంటారు..అయితే ఇప్పుడు ఆయన ఏకంగా జగన్ను కలవడం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.
రానున్న ఎన్నికలకు ముందు జగన్ బయోగ్రఫీని సినిమాగా తీసే ఉద్దేశ్యంతో జగన్ ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్నాథ రథచక్రాల్ పేరిట ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. జగన్‌కు ముఖ్య అనుచరుడైన ఓ రాయలసీమ ఎంపీ ఈ చిత్రానికి నిర్మాతగా ఉంటారని అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ కుమారుడి స్థాయి నుంచి సొంతంగా ముఖ్యమంత్రి వరకూ జగన్ ఎదిగిన తీరు ఈ చిత్రంలో చూపించే అవకాశం ఉంది.
2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ జీవితంలోని ప్రధాన ఘట్టాలు ఆయన చేపట్టిన పాదయాత్ర, ప్రజల కోసం కొన్ని సందర్భాల్లో అధిష్టానాన్ని సైతం ధిక్కరించిన తీరు..ఇవన్నీ కలుపుతూ మమ్ముట్టి ప్రధాన పాత్రధారిగా తీసిన యాత్ర చిత్రం మంచి ప్రజాదరణ పొందింది. ఆ ఎన్నికల్లో ఈ చిత్రం ప్రజల మద్దతును కూడగట్టింది.
అదే సమయంలో ఎన్టీయార్ జీవిత చరిత్రను బాలకృష్ణ ను ఎన్టీయార్ గా చూపుతూ కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా తీసిన బయోపిక్ ప్రజాదరణకు నోచుకోలేదు. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తీసిన ఈ చిత్రం డిజాష్టర్ అయింది. 2019 ఎన్నికల్లో పార్టీ క్యాడర్ ను ఉత్సాహ పరిచేందుకు, ఎన్టీయార్ గ్లోరిని మరోసారి ఈ తరానికి పరిచయం చేసేందుకు ఈ రెండు చిత్రాలు తీసినా టిడిపి వారి లక్ష్యం నెరవేరలేదు.
ఈ నేపథ్యంలో జగన్ బయో పిక్ తీసేందుకు అర్జీవి స్క్రిప్టు సిద్ధం చేశారట. ఈ క్రమంలోనే ఆయన జగన్ను కలిసి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ చిత్రం విడుదల కానుంది. మరి దీనికి పోటీగా టిడిపి క్యాంప్ ఏం చేస్తుందో చూడాలి.. చంద్రబాబు బయో పిక్ తీస్తుందేమో మరి..