Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. సోమవారం ఢిల్లీలో మీడియా చిట్ చాట్ లో ఆయన తన సినీ రంగ ప్రవేశం సమాచారాన్ని వెల్లడించారు. రాజకీయాల నుండి రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నట్లుగా తెలిపారు.
ఓ లవ్ స్టోరీ(ప్రేమ కథ) మూవీలో స్పెషల్ రోల్ లో నటించబోతున్నట్లుగా జగ్గారెడ్ది వెల్లడించారు. ఇంటర్వల్ కు ముందు మొదలయ్యే పాత్ర, సినిమా చివరి వరకు ఉంటుందని..నిజ జీవిత పాత్రనే పోషించనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. నా ఒరిజనల్ క్యారెక్టర్ కు సినిమాలోని రోల్ అద్దం పట్టనుందని…అందుకే తాను ఆ సినిమాలో నటించేందుకు అంగీకరించానన్నారు. సినీమాకు ‘జగ్గారెడ్డి…వార్ ఆఫ్ లవ్’ అనే టైటిల్‌ను ఖారారు చేసినట్లు తెలిపారు.
పీసీసీ, సీఎంల అనుమతి తోనే సినిమాలో నటిస్తానని.. ఈ ఉగాదికి సినిమా స్టోరీ వింటానని..వచ్చే ఉగాదికి సినిమా విడుదల కానుందని తెలిపారు. ఒక వ్యక్తి కలిసి.. నా క్యారెక్టర్ కు తగ్గట్టుగా క్యారెక్టర్ ఉన్న సినిమా ఉందని చెప్పాడని..దీంతో సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానన్నారు.
కాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై జగ్గారెడ్డి స్పందిస్తూ అభ్యర్థుల ప్రకటన తర్వాత నేను పొలిటికల్ బ్లాంక్ అయ్యానని.. ఏం మాట్లాడాలో చెప్పలేని షాక్‌లో ఉన్నానని.. సమయం వచ్చినప్పుడు మాట్లాడతానన్నారు. నేను సింపతీ రాజకీయాలను కోరుకోనన్నారు.
కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు జట్టి కుసుమకు ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరానని తెలిపారు. అనుకోకుండా ఢిల్లీకి తెలంగాణ నుంచి నేతలు రాలేదన్నారు. కుసుమకు ఎమ్మెల్సీ ఇవ్వాలని పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీసీఎ భట్టి విక్రమార్కకు చెప్పానన్నారు. తాను ఢిల్లీకి వచ్చి కుసుమ అంశం మాట్లాడాలని అనుకున్నానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ అంశాన్ని ముందే చెప్పినట్లు తెలిపారు.
తాను ఢిల్లీకి వచ్చినప్పుడు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ,కేసీ వేణుగోపాల్ లేరని జగ్గారెడ్డి వెల్లడించారు. 2017లో రాహుల్ గాంధీ సంగారెడ్డి సభను తానే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాటి కష్టాలు పరిణామాలు చెప్పాలని అనుకున్నానని.. దానిపై రాహుల్ గాంధీని కలిసేందుకు ఢిల్లీకి వచ్చినట్లు వెల్లడించారు. రేపటి వరకు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
కాగా తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కూడా ఇప్పటికే ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇండియన్ ఫైల్స్ అనే సినిమాలో ఆయన లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పుడు జగ్గారెడ్డి కూడా వెండితెర అరంగేట్రం చేయనుండటం గమనార్హం.