Jagga Reddy Vs KTR | విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీని చిల్లర పార్టీ..ధర్డ్ క్లాస్ పార్టీ అని విమర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యారెక్టర్ లేనోడు అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ నీకు ఇప్పుడు చిల్లర పార్టీ అయ్యిందా..? రాష్ట్రం ఇచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చాక..సోనియా గాంధీ ఇంటికి వెళ్లి ఫోటోలు దిగినప్పుడు చిల్లర అనిపించలేదా..? అని ప్రశ్నించారు. ఇవ్వాళ మీ కుటుంబం రాజకీయాల్లో..సంపదలో వెలిగిపోతుంది అంటే దానికి కారణం కాంగ్రెస్ కాదా..? అని జగ్గారెడ్డి నిలదీశారు. మీనాయన కేసీఆర్ సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది అని అసెంబ్లీలో చెప్పాడని..నీవు ఆ మాట నువ్వు మర్చిపోయావా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పార్టీ ఐతే.. మీ నాన్న ఆ పార్టీ నుండే కదా పాఠాలు నేర్చుకుందని.. కాంగ్రెస్ థర్డ్ క్లాస్ ఐతే..మీ నాన్న కూడా థర్డ్ క్లాసే కదా..? అని..
థర్డ్ క్లాస్ నుండే కదా..నువ్వు రాజకీయ నాయకుడివి అయ్యిందని జగ్గారెడ్డి విమర్శించారు. వందకోట్ల ప్రజలకు స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ అనడానికి మనసు ఎట్లా వచ్చిందని మండిపడ్డాు. కాంగ్రెస్ అంటే ఏందో మీ నాయన కేసీఆర్ నీ అడిగి తెలుసుకో అని హితవు పలికారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే .. మీ కుటుంబం వేల కోట్లు సంపాదించే అవకాశం రాకుండేకదా అన్నారు. అమెరికాలో జీతం మీదనే బతికే వాడివి నువ్వు అని..నీ కుటుంబం ఏం చేసి బతుకుతుండేనో మరి ఆలోచించాలన్నారు.
తెలంగాణ బిడ్డకు మద్దతునివ్వకపోగా..మా పార్టీపైనే ఆరోపణలా .?
తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా పెడితే.. తెలంగాణ బిడ్డగా ఆయనకు ఓటేయాల్సింది పోయి ఉల్టా కాంగ్రెస్ మీదనే ఆరోపణలు చేయడం ఏమిటని..కేటీఆర్.. కేసీఆర్ లవి పచ్చి అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అని జగ్గారెడ్డి విమర్శించారు. కేటీఆర్ పదేళ్లు మంత్రిగా ఉన్న రాజకీయ మెచ్యూరిటీ రాలేదని..అందుకే మాట దొర్లుతు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడన్నారు. కేటీఆర్..తాత..నానమ్మ బతికి ఉంటే..కేటీఆర్ ను పిలిచి తిట్టే వారని…చెంప మీద కొట్టేవాళ్ళుని..త్యాగాలకు కేటీఆర్ కి విలువ తెలియదని..వీళ్ళంతా డ్రామా ఆర్టిస్టులు అని జగ్గారెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దీక్ష అంతా కాంగ్రెస్ డిజైన్ అని..లేకుంటే కేసీఆర్ 11 రోజులు దీక్ష చేయగలడా.? అని..తిని దీక్ష చేసినా.. యాక్సెప్ట్ చేసే వాళ్ళు..అప్పుడు పరిస్థితి అలాంటిదని జగ్గారెడ్డి వెల్లడించారు. తీరా తెలంగాణ వచ్చి ప్రజలకు బెనిఫిట్ ఏమైందో తెలియదుగాని..కేసీఆర్ కుటుంబానికి మాత్రం బెనిఫిట్ అయ్యిందన్నారు. సచివాలయంలో నేను సమీక్ష చేశానని బీఆర్ఎస్ ఆరోపిస్తుందని..నేను ప్రతిపక్షం లో ఉన్నా.. అధికారంలో ఉన్నా మొగొన్నేనని చెప్పుకొచ్చారు. సచివాలయంలో దందా చేస్తే తప్పు కానీ.. ప్రజల కోసం సమీక్ష చేస్తే తప్పా అని..మళ్ళీ చేస్తానన్నారు. మీ లెక్క కొడుకు..అల్లుడు.. బిడ్డలు పంచుకున్నట్టు పంచుకున్నానా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిధులు ప్రజల కోసం తీసుకోవాలని..నేను కూడా రాజకీయ నాయకున్నే కదా..? అన్నారు.
యూరియా కొరతతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ కుట్ర
కిషన్ రెడ్డి మంచివాడైనా ప్రచారక్ రాసి ఇచ్చే స్పీచ్ చదివే స్క్రీప్టు లీడర్ అని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్ యూరియా సమస్యపై తొందర పడి మాట్లాడి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టు అయ్యిందని..కాంగ్రెస్ ను బదనం చేయాలని ఎరువులను అడ్డం పెట్టుకుని బీజేపీ డ్రామా ఆడుతుందని ఆరోపించారు. కేంద్రమే యూరియా ఇవ్వాలని..వేల కోట్లు రైతులకు ఇచ్చే రేవంత్ రెడ్డికి.. ఎరువులు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది ఉంటదా? అని ప్రశ్నించారు. రైతుల ముసుగులో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనలతో పేరుతో రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.