Site icon vidhaatha

KTR on Urea Shortage | కేటీఆర్ : రైతును అరిగోస పెడుతున్న కాంగ్రెస్ పతనం ప్రారంభం

ktr-criticizes-congress-for-urea-shortage

 KTR on Urea Shortage | విధాత, హైదరాబాద్ : రైతును అరిగోస పెడుతున్న కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చిల్లర రాజకీయాలు తప్ప పరిపాలన అంటే ఏమిటో తెలియని అసమర్థులు రాజ్యమేలడం వల్లే రైతులకు యూరియా కష్టాలు ఏర్పడ్డాయని విమర్శించారు. కేసీఆర్‌ దూరదృష్టి..ముందుచూపు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం వల్లే రైతాంగానికి యూరియా కష్టాలు ఎదురయ్యాయన్నారు. గతంలో కేంద్రం, రాష్ట్ర వ్యవసాయ శాఖలు, రైల్వే, రవాణా శాఖలను సమన్వయం చేసి యూరియా కొరతను కేసీఆర్ పరిష్కరించారన్నారు. ఒకవైపు బూతులు మాట్లాడడం తప్ప చేతలు రాని ఢిల్లీ పార్టీల నాయకులకు, మరోవైపు ‘వందేళ్ల విజన్‌కు నిలువెత్తు రూపమైన కేసీఆర్ కి’ ఉన్న స్పష్టమైన తేడా నాలుగు కోట్ల తెలంగాణ సమాజానికి ఇప్పుడు అర్థమైపోయిందని ఆయన అన్నారు.

నాడు కేసీఆర్ యూరియా కొరతను పరిష్కరించేందుకు ఏపీలోని నౌకాశ్రయాలకు మన అధికారులను పంపి, సరఫరాను పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేసి..దక్షిణ మధ్య రైల్వే అధికారులకు స్వయంగా ఫోన్ చేసి, 25 స్పెషల్ గూడ్స్ ట్రెయిన్‌లను ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. పక్క రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో నేరుగా సంప్రదింపులు జరిపి, ఏకంగా 4 వేల లారీలను రంగంలోకి దించేలా కేసీఆర్ నాడు చర్యలు తీసుకున్నారని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్‌ నాయకత్వం, ముందుచూపు, పకడ్బందీ పాలన అంటే ఏమిటో ఇప్పుడు తెలంగాణ సమాజానికి అర్థమైందని కేటీఆర్ పేర్కొన్నారు.

Exit mobile version