అందుకే ప్రజలు బీఆర్ఎస్ కు ఓటెయ్యడం లేదు : కడియం ఘాటు వ్యాఖ్యలు

బీఆర్ఎస్ నేతల అహంకారం తగ్గకపోవడంతోనే ప్రజలు ఆ పార్టీకి ఓటు వేయడం లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కౌంటర్ ఇచ్చారు.

విధాత, హైదరాబాద్ : అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించినప్పటికి బీఆర్ఎస్ నేతలకు, కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు అహంకారం తగ్గడం లేదని, మాట తీరులో మార్పు రావడం లేదని..అందుకే ప్రజలు ఆ పార్టీకి ఓటు వేయడం లేదు అని మాజీ మంత్రి, స్టేషన్ ఘన పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన కడియం బీఆర్ఎస్ నాయకుల తీరుపై మండిపడ్డారు. అధికారం కుటుంబ హక్కు అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు, కల్వకుంట్ల కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జాతిపితలు దేశానికి ఒక్కరే ఉంటారని, ఆయనే మహాత్మా గాంధీ అన్నారు. కేసీఆర్ ఏం చేశారని జాతిపిత అని చెప్పుకుంటున్నారు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో అవినీతితో వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు అని కడియం ఆరోపించారు.

2014 ముందు మీ కుటుంబం ఆస్తులు ఎన్ని ? ఇప్పుడు ఎన్ని ఉన్నాయో.. ప్రజల ముందు పెట్టాలని బీఆర్ ఎస్ నేతలను కడియం డిమాండ్ చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో అందరూ కేసుల్లో ఉన్నారని గుర్తు చేశారు. అవినీతి అంశంలో బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడితే తెలంగాణను అవమానించినట్లా అని కడియం ప్రశ్నించారు. తెలంగాణ మీ అయ్య సొత్తా అని, ఎన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ వాడుకుంటారు అని కడియం విమర్శించారు.

కడియంకు కేసీఆర్ రాజకీయ భిక్ష: వివేకానంద గౌడ్

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన 10మంది ఎమ్మెల్యేలు భయాందోళనలో ఉన్నారంటూ కడియంపై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కే.వివేకానందగౌడ్ ఎద్దేవా చేశారు. కడియం సహా ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంతా బయట కాంగ్రెస్ అంటారు అని.. అసెంబ్లీలో మాత్రం బీఆర్ఎస్ అంటారు అని విమర్శిచారు. కేసీఆర్ కాళ్లు పట్టుకుంటే కడియం శ్రీహరికి గతంలో ఎంపీ అవకాశం వచ్చింది అన్నారు.

దమ్ముంటే కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని వివేకానంద గౌడ్ డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ వద్ద తప్పించుకున్నా… న్యాయస్థానంలో తప్పించుకోలేరు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని వివేకానంద పురురుద్ఘాటించారు.

ఇవి కూడా చదవండి :

Peddi | పెద్ది నాన్-థియేట్రికల్ బిజినెస్ జోరు… చ‌ర‌ణ్ రేంజ్‌కి ఈ మాత్ర‌మేనా అంటున్న ఫ్యాన్స్
రాజగోపాల్ రెడ్డి అంశంపై హైకమాండ్ తో చర్చించాం : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

Latest News