చరిత్ర సృష్టించిన జపాన్‌..! చంద్రుడిపై దిగిన ‘మూన్‌ స్నిపర్‌’..

జపాన్‌ చరిత్ర సృష్టించింది. భారత్‌ తర్వాత చంద్రుడిపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసింది

  • Publish Date - January 20, 2024 / 02:38 AM IST

Moon Sniper | జపాన్‌ చరిత్ర సృష్టించింది. భారత్‌ తర్వాత చంద్రుడిపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసింది. జపాన్ స్పేస్ ఏజెన్సీ ‘మూన్ స్నిపర్’ రోబోటిక్ ఎక్స్‌ప్లోరర్ విజయవంతంగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసినట్లు ప్రకటించింది. అమెరికా, రష్యా, చైనా, భారత్‌ తర్వాత ఈ ఘనత సాధించిన ఐదో దేశంగా జపాన్‌ నిలిచింది.


అయితే, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) అంతరిక్ష నౌక సోలార్‌ సెల్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేయకపోవడంతో మిషన్‌ పని చేయకుండాపోతుందేమోనని ఆందోళనకు గురవుతున్నది. ల్యాండర్ నుంచి సంకేతాలు అందుతున్నాయని, ఇది ఊహించిన విధంగా కమ్యూనికేట్ చేస్తోందని స్పేస్‌ ఏజెన్సీ తెలిపింది. ల్యాండర్ ప్రస్తుతం పరిమిత బ్యాటరీ పవర్‌తోనే పనిచేస్తోందని, ఇది పరిమిత గంటలు మాత్రమే ఉంటుందని జాక్సా అధికార వర్గాలు తెలిపాయి.


ప్రస్తుతం జాక్సా శాస్త్రవేత్తల బృందం సోలార్ సెల్ సమస్య పని చేయకపోవడానికి కారణాలను, ల్యాండర్ కోసం తదుపరి దశలను గుర్తించడానికి డేటాను విశ్లేషిస్తున్నట్లు పేర్కొంది. వ్యోమనౌక ముందుగా నిర్ణయించిన దిశలో కదలకపోవడంతోనే సోలార్ సెల్ సమస్య వచ్చి ఉంటుందని జాక్సా భావిస్తున్నది. అయితే, సోలార్‌ యాంగిల్‌ మారిన తర్వాత చంద్రుడిపై ఉన్న సోలార్‌ సెల్స్‌ మళ్లీ ఛార్జ్‌ అయ్యే అవకాశం ఉంటుందని జపాన్ అంతరిక్ష శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.


అయితే, దీనికి కొంత సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. స్మార్ట్‌ ల్యాండర్‌ చంద్రుడి అతి శీతలమైన రాత్రి ఉష్ణోగ్రతలను తట్టుకొని బయటపడితేనే ఛార్జ్‌ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ముందుగా నిర్ణయించిన అన్ని ప్రమాణాలకు అనుగుణంగా స్లిమ్ మిషన్‌ విజయవంతమైందని. అంతరిక్ష నౌక ఆప్టికల్ నావిగేషన్ ఉపయోగించి చంద్రుడిపై ఖచ్చితంగా సాఫ్ట్‌ల్యాండింగ్‌ అయ్యింది. జాక్సా డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ హితోషి కునినాక మిషన్‌ 60శాతం విజయవంతమైనట్లు పేర్కొన్నారు.


జపాన్ స్పేస్ ఏజెన్సీ స్మార్ట్ ల్యాండర్ (SLIM) మిషన్ శుక్రవారం ఉదయం 10.20 (స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:20) చంద్రుని ఉపరితలంపై దిగింది. ఇది మానవ రహిత అంతరిక్ష నౌక. చంద్రుని ఉపరితలంపై అంతరిక్ష నౌక దిగిన కొద్దిసేపటికే.. మిషన్ కంట్రోల్ రూమ్ అంతా ప్రణాళిక ప్రకారం జరిగిందని.. ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా దిగిందని జాక్సా తెలిపింది.

Latest News