cha 1107-7626 | అనంత విశ్వం అంతుచిక్కని రహస్యాల పుట్ట. ఇందులో రహస్యాలను శాస్త్రవేత్తలు భారీ టెలిస్కోపులు పెట్టి శోధిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. దానిని చూసిన శాస్త్రవేత్తలు నివ్వెరపోయారు. ఆ గ్రహానికి Cha 1107-7626 అని పేరు పెట్టారు. నిజానికి ఇది పుట్టి మూడు నెలలు అవుతున్నది. కానీ.. దాని పరిమాణం ఊహించలేని స్థాయిలో పెరుగుతూ పోతున్నది. ఇది తన సమీపం నుంచి ప్రతి ఒక్క క్షణానికి ఆరు వందల కోట్ల టన్నుల గ్యాస్, ధూళిని ఆకర్షించుకుంటున్నది. ఈ కొత్త దుష్ట ‘శిశు’ గ్రహాన్ని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీలోని అతి పెద్ద టెలిస్కోప్ (ESO’s VLT) ద్వారా గుర్తించారు. ఈఎస్‌వోకు చెందిన వెరీ లార్జ్ టెలిస్కోప్ (VLT), చిలీలోని అటకామా ఏడారిలో ఉన్నది. దీనితోపాటు నాసా, ఈఎస్‌ఏ, సీఎస్‌ఏ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నుంచి సేకరించిన డాటా సహకారాన్ని కూడా ఈ అధ్యయనంలో తీసుకున్నారు. తనకు ఇష్టం వచ్చిన దిశలో అడ్డదిడ్డంగా పయనిస్తున్న ఈ గ్రహం తన సమీపంలోని వాయువులు, ధూళిని అత్యంత వేగంగా లాగేస్తుండటం గ్రహాల ఏర్పాటుపై కొత్త ఆలోచనలకు తావిస్తున్నది.
Cha 1107-7626 బృహస్పతి గ్రహంతో పోల్చితే ఐదు నుంచి పదింతలు ఉంది. ఇది 620 కాంతి సంవత్సరాల దూరంలో చామెలియన్ (Chamaeleon) రాశిలో ఉన్నది. గ్యాసెస్, ధూళితో కూడిన సర్కమ్‌ప్లానెటరీ డిస్క్ ద్వారా ఈ ‘శిశు’ గ్రహానికి ‘ఆహారం’ అందుతున్నది. ఈ ప్రక్రియను అక్రెషన్ అని పిలుస్తారు. అంటే నిరంతరాయంగా గ్రహంపై పడటం. ఈ అక్రెషన్ ఆగస్ట్ 2025 నాటికి Cha 1107-7626పై ఆకస్మిక యాక్సిలరేషన్‌ను చూసింది. కొన్ని నెలల్లోనే ఎనిమిది రెట్ల వేగం పుంజుకున్నది. ఫలితంగా ఇప్పుడు సెకనుకు ఆరు వందల టన్నులకు ఈ పెరుగుదల చేరుకున్నది. ఈ ఆవిష్కరణను ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్ (Astrophysical Journal Letters)లో ప్రచురించారు.
ఈ గ్రహం ఇంకా ఏర్పడుతూనే ఉన్నది. ఇటువంటి భారీ గ్రహాలు ఎలా రూపుదిద్దుకుంటాయనే విషయంలో ఈ కొత్త గ్రహం శాస్త్రవేత్తల మేదడుకు మేత పెడుతున్నది. ‘కొత్తగా పుట్టిన (నవజాత గ్రహం) ఈ దుష్ట గ్రహం అత్యంత వేగంగా సమీపంలోని వాటిని మింగేస్తున్న చర్యను మేము పట్టేశాం’ అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయవర్ధన అన్నారు. గ్రహాలు నిశ్శబ్దమైన, స్థిరమైన ప్రపంచాలు కావనే అంశాన్ని ఈ ఆవిష్కరణ రుజువు చేస్తున్నదని అధ్యయనం ప్రధాన రచయిత విక్టర్ అల్మెండ్రోస్–అబాద్ చెప్పారు. ఈయన ఇటలీలోని పలెర్మోలోని ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ అండ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ (INAF)లో ఖగోళ శాస్త్రవేత్త. గ్రహ ద్రవ్యరాశి విషయంలో ఇంతటి బలమైన స్థాయి రికార్డవడం ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Space Elevator | చందమామపైకి నిచ్చెన! సాధ్యాసాధ్యాలేంటి? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
SUN | సూర్యుడు ఏర్పడేటప్పుడు ఇలానే ఉండి ఉంటాడేమో..! చిత్రం విడుదల చేసిన నాసా
Alien Spacecraft Attack | దాడి చేసేందుకు వస్తున్న గ్రహాంతర వాసులు..? నవంబర్‌లో యుద్ధమేనా!