Kadem project
- కడెం ప్రాజెక్టు సందర్శించిన కేంద్ర జల కమిషన్ బృందం
- కుఫ్టి ప్రాజెక్టు పూర్తయితే కడెం ప్రాజెక్టుకు తగ్గనున్న వరద పోటు
- 1959లో 9 గేట్లు, ప్రాజెక్ట్ 5.5 టీఎంసీల సామర్థ్యం
- అనంతరం 18గేట్లు, 7.టీఎంసీలకు పెంచిన అప్పటి ప్రభుత్వం
- మరో 4 గేట్లు పెంచితే లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు నుండి ఊరట
విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: తాజాగా కురిసిన భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టు కు భారీగా వరద నీరు పోటెత్తి ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ప్రాజెక్టు సామర్ధ్యానికి మించి కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో గేట్లపై నుంచి సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వెళ్లడం, 18 గేట్లకు 4 గేట్లు మొరాయించడంతో మిగతా 14 గేట్ల ద్వారా మరో రెండు లక్షల క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి వదలాల్సివచ్చింది. దీంతో కడెం ప్రాజెక్టు దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాలైన పాండవపూర్, కన్నాపూర్ తదితర 10 గ్రామాల ప్రజలను ఉన్న ఫలంగా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు.
ప్రాజెక్టు నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువ ప్రాంతానికి వదిలిన నేపథ్యంలో మిగతా 4 గేట్లు తెరుచుకోకపోవడం, 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టు గేట్ల పై నుంచి ప్రమాదకర పరిస్థితిలో దిగువకు రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 4 లక్షల క్యూసెక్కుల నీరు సైతం ప్రాజెక్టు గేట్ల నుండి ప్రాపర్‌గా కిందికి వదిలితే లోతట్టు ప్రాంతాల ప్రజలకు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు . పరిమితికి మించిన వరద ఏకంగా ప్రాజెక్టుపై నుండి దూసుకెళ్లడంతో ప్రాజెక్ట్ కు ఏప్పుడు ఏమవుతుందోనన్న ఆందోళన సర్వత్రా వినిపించింది.
వరదొచ్చినప్పుడే హడావుడి
గత రెండు సంవత్సరాల నుండి కడెం ప్రాజెక్టు ఎప్పుడు కూడా ప్రమాదకర పరిస్థితి మధ్యలో కొనసాగుతు న్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వరద ముంపు బాధితుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ప్రాజెక్టు కు వరద నీరు పోటెత్తినప్పుడే స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖ శ్యాంనాయక్ ప్రాజెక్టు సందర్శించి హడావుడి చేసి మళ్లీ సంవత్సరం వరకు ప్రాజెక్టు మరమ్మత్తుల గురించి పట్టించుకోకపోవడం మూలంగానే ఇలా రెండో సంవత్సరం కూడా ప్రాజెక్టుకు ఇలాంటి విపత్కర పరిస్థితి నెలకొందని వరద భాదితులు ఆరోపిస్తున్నారు.
ప్రాజెక్టు మొత్తం గేట్లు తెరిస్తే సుమారు మూడు లక్షల పై చిలుకు క్యూసెక్కుల నీరు కిందికి వదిలే అవకాశాలున్నాయి. గత రెండు సంవత్సరాల నుండి ప్రాజెక్టుకు నాలుగు, ఐదు లక్షల క్యూసెక్కుల భారీగా వరద నీరు చేరుతున్నప్పటికి అధికారులు, నేతలు ముందస్తు చర్యలు చెప్పటం లేదనే విమర్శలు ఉన్నాయి.
అదనపు గేట్లతోనే వరద సమస్యలకు చెక్
ఈ నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నుండి వరద నీరు సజావుగా వెళ్లాలంటే ఇప్పుడు ఉన్న గేట్లకు మరో నాలుగు గేట్లను అదనంగా నిర్మాణం చేపట్టినట్లయితే సుమారు 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సునాయాసంగా దిగువకు వదిలే అవకాశం ఉంటుంది. రైతుల పక్షపాతి ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకొనే కేసీఆర్ గాని, జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాయకులు సంవత్సర కాలం నుండి ఏం చేస్తున్నారని వరద బాధితులు విమర్శిస్తున్నారు .
వరదొస్తే ఊరొదలాల్సిందే..
రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్పుకోనే పాలకులు గత రెండేళ్లుగా ప్రాజెక్టు ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ప్రాజెక్ట్ మరమ్మతుల విషయంలో ఇంత అలసత్వం ఏమిటని నిలదీశారు . గత రెండేళ్ల నుండి 10 గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం ప్రాజెక్టు డేంజర్ జోన్ లోకి వెళ్ళగానే ఇళ్లు వాకిలి వదిలి కన్నీళ్లతో పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు.
ప్రాజెక్టు ల మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాయకులు, అధికారులు గాని ఒక నాలుగు రోజులు పునరావాస కేంద్రాల్లో ఉంటే సురక్షిత, పునరావాస కేంద్రాల పని తీరు ఏమిటో అర్థం అవుతుందని వరద బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి .
గేట్ల పెంపుకు కేంద్ర బృందం నిర్ణయం
ఎట్టకేలకు వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రస్తుతం కడియం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గి ప్రాజెక్టు ప్రమాదం నుండి బయటపడింది. అనంతరం రెండు రోజుల క్రితం కేంద్ర జల వనరుల బృందం కడెం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పరిశీలించింది . అధికారుల నుండి సమాచారం సేకరించింది. గేట్ల పైనుండి వరద నీళ్లు ఎక్కువ శాతం ఏ వైపు నుండి వెళ్ళాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కడెం ప్రాజెక్టుకు ప్రస్తుతం ఉన్న 18 గేట్లకు రెండు వైపులా రెండేసి గేట్లు అదనంగా పెంచాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఏదైనప్పటికీ మరో నాలుగు గేట్లు అదనంగా నిర్మిస్తే దాదాపుగా నాలుగు నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని ఎలాంటి ఇబ్బంది లేకుండా గేట్ల నుండి వదిలే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు కొంత ఊరట కలిగే అవకాశం ఉంది .
కుఫ్టితో కడెంకు తగ్గనున్న వరద పోటు
మరోవైపు 2015 కడెం ప్రాజెక్టు వరద నీరును అంచనా వేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో వరద నియంత్రించే క్రమంలో 900 కోట్ల వ్యయంతో కుఫ్టి దగ్గర 5 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని తలపెట్టింది.
18 వేల ఎకరాలకు సాగునీరు, మూడు మెగావాట్ల జలవిద్యుత్తు తయారీతో పాటు నేరేడి కొండ బోథ్, ఇచ్చోడ, బజారుహత్నూర్, కడెం మండలాలకు త్రాగునీరు అందించ లక్ష్యంతో కుఫ్టి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇవన్నీ పనులు కావడానికి సవరించిన అంచనాల ప్రాజెక్టు డిపిఆర్ మేరకు 1100 కోట్లకు అంచన వ్యయం పెరగడంతో ఆ ప్రాజెక్టు అక్కడే ఆగిపోయింది.
అప్పుడే ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తే మూడు నాలుగేళ్లలో పూర్తయి కడెం ప్రాజెక్టుకు వరద పోటు తగ్గి లోతట్టు ప్రాంతాల ప్రజలు సంతోషంగా ఉండేవారు . అక్కడ కుఫ్టి ప్రాజెక్టు ఆగిపోయి, ఇక్కడ కడెం ప్రాజెక్టుకు గత రెండు సంవత్సరాల నుండి మరమ్మత్తులు చేయకపోవడంతో వరద పోటెత్తిన సమయంలో నాలుగు గేట్లు మొరాయించి ప్రాజెక్టును, లోతట్టు ప్రాంతాల ప్రజలను డేంజర్ జోన్‌లో పడేసింది. కడెం ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం గేట్లకు గ్రీసు పెట్టడానికి కూడా నిధులు మంజూరు కాలేదని ఆరోపణలు ఉన్నాయి.
ఇన్ని కారణాలతో కడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల ప్రజలు రెండు సంవత్సరాల నుండి వర్షాకాలం అంటేనే బెంబేలెత్తిపోతున్నారు . ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన స్పందించి వచ్చే వర్షాకాలంలోపు యుద్ధ ప్రాతిపదికన ఉన్న 18 వరద గేట్లకు మరో నాలుగు అదనపు గేట్లను నిర్మాణం చేసి కడెం ప్రాజెక్టును కాపాడంతో పాటు లోతట్టు గ్రామాల ప్రజలను ఆదుకోవాలని వరద బాధితులు కోరుతున్నారు.