కూలగొడుతామని అనలేదు: కడియం, పల్లాల స్పష్టీకరణ

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడుతామని, మళ్లీ బీఆరెస్ ప్రభుత్వమే వస్తుందని తాము వ్యాఖ్యానించలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్యే పల్లా లు స్పష్టం చేశారు

  • Publish Date - December 14, 2023 / 11:53 AM IST

విధాత: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడుతామని, మళ్లీ బీఆరెస్ ప్రభుత్వమే వస్తుందని తాము వ్యాఖ్యానించలేదని మాజీ మంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు స్పష్టం చేశారు. హైద్రాబాద్‌లో శాసన సభ ఆవరణలో మీడియా పాయింటలో కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారన్నారు. ప్రభుత్వాన్ని పడగొడుతామని తాను అనలేదన్నారు.


కాంగ్రెస్‌కు బొటాబొటీ మెజార్టీ ఉందని.. కాంగ్రెస్‌లో వర్గపోరు సాగుతుందని మాత్రమే చెప్పానన్నరు. బలమైన ప్రతిపక్షం ఉందని, మీరు బాగా పనిచేయాల్సివుంటుందని మాత్రమే చెప్పానన్నారు. నేను అన్న దాన్ని వక్రీకరించి కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారని, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదన్నారు. అందుకే మేం ఒకటి మాట్లాడితే వాళ్ళు ఒకటి ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఆర్థిక పరిస్థితి కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు సహకరించదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.


అంతకు ముందు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ కూలి పోతుందని నేను అనలేదన్నారు. తాను అనని మాటలను అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో చేరుతారా? అని నన్ను అడిగితే తాను పార్టీ మారేది లేదని తేల్చి చెప్పానన్నారు. బీఆరెస్‌ పాలనపైన, ఆర్థిక పరిస్థితులపైన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రజల తరుపున కోరుతున్నామన్నారు.