Site icon vidhaatha

‘విక్రమ్’ హిట్‌తో కమల్ హాసన్ థింకింగే మారిపోయింది

విధాత: యూనివర్సల్ హీరో కమల్ హాసన్.. చాలా గ్యాప్ తర్వాత చేసిన ‘విక్రమ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కమల్ హాసన్‌కు కొత్త ఊపిరినిచ్చింది. ఈ సినిమాని స్వయంగా ఆయనే నిర్మించారు. ‘విక్రమ్’తో తన అప్పులన్నీ తీరిపోయినట్లుగా కమల్ హాసనే స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ‘విక్రమ్’ సినిమా దర్శకుడికి, మ్యూజిక్ డైరెక్టర్‌కి గిఫ్ట్‌లు కూడా ఇచ్చారు.

ఈ సినిమా ఇచ్చిన విజయానందంతో.. ఇకపై తన బ్యానర్ రాజ్‌ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్‌లో భారీ చిత్రాలతో పాటు, మంచి కంటెంట్‌తో వస్తే.. చిన్న చిత్రాలు కూడా చేస్తానని కమల్ ప్రకటించాడు. ఆయన ప్రకటించినట్లే.. ఇప్పుడు శివకార్తికేయన్ హీరోగా ఒక చిత్రాన్ని కమల్ నిర్మిస్తున్నాడు. ఇప్పుడు తనే హీరోగా మరో భారీ ప్రాజెక్ట్‌ను కమల్ తాజాగా ప్రకటించాడు. ఈ సినిమా దర్శకుడెవరో తెలుసా? లెజండరీ దర్శకుడు మణిరత్నం.

రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI), మద్రాస్ టాకీస్ (మణిరత్నం), రెడ్ జెయింట్ మూవీస్ (ఉదయనిధి స్టాలిన్) క్రేజీ కాంబినేషన్‌లో కమల్ హాసన్ 234 చిత్రం తెరకెక్కబోతుందని, 2024లో ఈ చిత్రం థియేటర్లోకి రానున్నట్లు సగర్వంగా టీమ్ ప్రకటించారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తే.. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలు కమల్ హాసన్, మణిరత్నంల మ్యాజికల్ కలయికలో వచ్చిన ‘నాయగన్’ కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

దాదాపు 35 సంవత్సరాల తర్వాత మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతుంది. కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్ & శివ అనంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ సమర్పించనున్నారు. ఈ సినిమా అనౌన్స్ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘‘35 సంవత్సరాల క్రితం మణి సార్‌తో పని చేసినపుడు ఎంత ఉత్సాహంగా ఉన్నానో.. ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా ఉంది. ఒకేరకమైన మనస్తత్వంతో ఉన్న వారితో కలసి పనిచేయడం గొప్ప ఉత్తేజాన్నిస్తుంది. ఈ ఉత్సాహంలో రెహమాన్ కూడా తోడయ్యారు. మిస్టర్ ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ఈ వెంచర్‌ని ప్రజంట్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.

మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘విక్రమ్’తో మరోసారి కమల్ హాసన్ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసింది. ‘విక్రమ్’ పార్ట్ 2 కూడా ఉందని ఆ సినిమా చివరిలో హింట్ ఇచ్చారు. ఇప్పుడు మణిరత్నంతో సినిమా. మొత్తానికి ‘విక్రమ్’ సక్సెస్.. కమల్ హాసన్‌‌కు బూస్ట్ ఇచ్చిందని.. అందుకే ఈ స్పీడ్ అంటూ కోలీవుడ్ అంతా మాట్లాడుకుంటోంది.

Exit mobile version