Karimnagar | ప్రాణాలు పోయే స్థితిలో రైతులుంటే.. ప్లీనరి వేడుకల్లో BRS నేత‌లు!

Karimnagar ఆత్మీయ సమావేశాల్లో మునిగి తేలుతుండడం దురదృష్టకరం కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి విధాత బ్యూరో, కరీంనగర్: గత మూడు, నాలుగు రోజులుగా అకాల వర్షాలు, వడగళ్ళ వాన భీభ‌త్సంతో రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పంటలు కాపాడుకోలేక అల్లాడుతుంటే, పార్టీ ప్లీనరి పేరుతో అధికార బీఆర్ఎస్ పార్టీ సంబరాలు నిర్వహించడం సిగ్గు చేటని కరీంనగర్ (Karimnagar) జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల పట్టణంలోని […]

  • Publish Date - April 26, 2023 / 01:16 PM IST

Karimnagar

  • ఆత్మీయ సమావేశాల్లో మునిగి తేలుతుండడం దురదృష్టకరం
  • కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి

విధాత బ్యూరో, కరీంనగర్: గత మూడు, నాలుగు రోజులుగా అకాల వర్షాలు, వడగళ్ళ వాన భీభ‌త్సంతో రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పంటలు కాపాడుకోలేక అల్లాడుతుంటే, పార్టీ ప్లీనరి పేరుతో అధికార బీఆర్ఎస్ పార్టీ సంబరాలు నిర్వహించడం సిగ్గు చేటని కరీంనగర్ (Karimnagar) జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి విమర్శించారు.

జగిత్యాల పట్టణంలోని చల్ గల్ వ్యవసాయ మార్కెట్ యార్డుని సందర్శించి, ధాన్యం పరిస్థితి పరిశీలించి, రైతుల‌ను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కదిలిస్తే కన్నీటి గాధలే అన్నట్టుగా రైతుల దుస్థితి ఉంటే, ఆదుకోవాల్సిన ప్రభుత్వం, అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు పార్టీ సమావేశాలు, ప్లీనరి వేడుకలు, ఆత్మీయ సమావేశాల పేర సంబరాల్లో మునిగి తేలుతుండడం దురదృష్టకరం అన్నారు.

గత నెల గంగాధర పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, ఎకరాకు రూ.10 వేలు నష్ట పరిహారం ఇస్తామని హామీ ఇచ్చి సుమారు నెల రోజులు గడిచినా పైస ఇవ్వలేదన్నారు. రైతులు ఓ వైపు తడిసి, వరదలకు కొట్టుకుపోయిన ధాన్యంతో, నేల రాలిన మామిడి పంటతో దిక్కుతోచని స్థితిలో మనోధైర్యం కోల్పోయి ఉంటే రైతుల దయనీయ స్థితి బీఆర్ఏస్ నేతలకు కనిపించక పోవడం విచారకరం అన్నారు.

ఇప్పటికైనా సంబరాలు పక్కన పెట్టి అకాల వర్షాలతో అల్లాడుతూ సతమతమవుతున్న అన్నదాతలను ఆదుకోవడానికి చర్యలు చేపట్టడంతో పాటుగా, కల్లాల్లోకి వెళ్లి రైతుల కన్నీరు తుడవాలని సూచించారు. ప్రతిపక్షాల మాటలను విమర్శలుగా కాకుండా విజ్ఞతతో సలహాలు, సూచనలుగా స్వీకరించాలని హితవు పలికారు.

తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంతో పాటుగా, పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని తక్షణమే అమలు అయ్యేలా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతాంగానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఆమె వెంట‌ మాజీ కౌన్సిలర్ అల్లాల సరిత రమేష్ రావు, నాయకురాలు రజితతో పాటు రైతులు ఉన్నారు.