తమ సమస్యలపై నిరసనలు తెలిపే క్రమంలో కొందరు వినూత్న ప్రయత్నాలు చేస్తుంటారు. తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదని ఖాళీ బిందెలతో ప్రదర్శనలు నిర్వహించడం చూశాం. పంటలు ఎండిపోతున్నాయంటూ ఎండిపోయిన వరి మొక్కలతో ఆందోళనలు జరగడమూ తెలిసిందే. ఇదే క్రమంలో ఒక రైతు ఏకంగా కరెంటాఫీసుకు మొసలిని తీసుకొని వచ్చాడు.
రాత్రిపూట కరెంటు ఇవ్వడం వల్ల ఆ సమయంలో పొలాలకు వెళ్లిన రైతులను పాములో తేళ్లో కుడితే లేదా మొసళ్లు మీదపడితే ఏం చేస్తారని విద్యత్తు శాఖ అధికారులను ప్రశ్నించాడు. కర్ణాటకలోని హుబ్లి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఉదంతం.. ఆలస్యంగా వెలుగు చూసింది. కర్ణాటకలో తరచూ కరెంటు కోతలు ఉంటున్నాయని రైతులు ఆందోళకు దిగుతున్నారు.
ఇలాగే విజయపుర జిల్లాలోని రొనిహాలా గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ పొలాల్లో కనిపించిన భారీ మొసలిని పట్టుకుని హుబ్లి విద్యుత్తు సరఫరా కంపెనీ వద్దకు వచ్చారు. రాత్రిపూట ఇటువంటివాటి బారిన పడకుండా ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఆ మొసలిని అధికారుల ముందు పడేసి.. పగటిపూట నిరంతరాయంగా మూడు గంటల విద్యుత్తును సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో కరెంటు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నది.
దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యుత్తు శాఖ కార్యాలయానికి తీసుకొచ్చిన మొసలిని.. ఫారెస్టు అధికారులు స్వాధీనం చేసుకుని, ఆల్మట్టి నదిలో విడిచిపెట్టారు. రైతులు ఇంతటి సాహసోపేత ఆందోళనకు దిగినప్పటికీ.. వారి సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.