విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: ఎన్నికల్లో గెలుపు సాధనకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు దత్తత పేరుతో ప్రజలను మోసం చేయడం అలవాటుగా మార్చుకున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. శనివారం తిప్పర్తి మండలంలో నిర్వహించిన ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలో ఆయన మాట్లాడారు.
నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్నకేసీఆర్ ఇప్పటివరకు ప్రత్యేకంగా ఎలాంటి నిధులు ఇవ్వకుండా, అభివృద్ధి చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. అంతకుముందు ఎన్నికల్లో కుర్చీ వేసుకుని ఎస్ ఎల్ బిసి సొరంగం, ఉదయ సముద్రం ప్రాజెక్టులను పూర్తి చేస్తానని చెప్పి నిధులివ్వక నియోజకవర్గ ప్రజలకు, రైతులకు అన్యాయం చేసారన్నారు.
అభివృద్ధి విషయంలో విఫలమైన కోమటిరెడ్డి
గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభివృద్ధి విషయంలో విఫలమయ్యారని, సీఎం దత్తత మాటలను నమ్మి కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపిస్తే కూడా నియోజకవర్గం అభివృద్ధి సాగడం లేదన్నారు. తిప్పర్తిలో మెడికల్ షాపుల కన్న బెల్ట్ షాప్ లు ఎక్కువగా ఉన్న అద్వాన్న దుస్థితి నెలకొందన్నారు. మహిళలు కూలీనాలీ చేసి కష్టపడిన డబ్బులు భర్తల మద్యం కే వెళ్లిపోతున్నాయన్నారు. నియోజకవర్గంలో రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పత్తా లేవని, రాష్ట్రంలో కేసీఆర్ నియంత, కుటుంబ అవినీతి పాలన సాగుతుందన్నారు.
కొడుక్కి టికెట్ కోసం బీజేపీపై గుత్తా విమర్శలు
రాష్ట్ర పరిస్థితి అద్వాన్నంగా ఉంటే గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ.. కొడుక్కి టికెట్ కోసం కెసిఆర్ దగ్గర మెప్పు పొందడానికి బీజేపీ పై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గుత్తాకు దమ్ముంటే రాజీనామా చెసి ఎన్నికల్లో నిలబడాలని, గెలిచే సత్తా లేక మూడు పార్టీలు మారిన గుత్తాకు బీజేపీని విమర్శించే అర్హత లేదన్నారు.