విధాత: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం పట్టం కట్టబోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ కవితను ఓడించినట్లే.. రాష్ట్రంలో ఆ పార్టీని ప్రజలు ఓడిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు 2లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తీసుకుంటుందన్నారు.
ధరణి పోర్టల్ రద్దు చేసి ప్రతి రైతుకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటామని రేవంత్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే నిరుద్యోగ సమస్య తీరుస్తామన్నారు. 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సాయం అందాలంటే రైతు చావాల్సిందేనా…?
“దేశం సంగతి దేవుడెరుగు ముందు ధరణితో నష్టపోయిన 25 లక్షల మంది రైతుల ఇబ్బందులు తీర్చండి” అని సీఎం కేసీఆర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్.. దేశంలో రైతు రాజ్యం తెస్తారా? అని ప్రశ్నించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసి కేసీఆర్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. తెలంగాణలో రైతులు పండించే పంటకు బీమా లేదు.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతులకు సాయం అందాలంటే రైతు మరణించా ల్సిందేనా? అని రేవంత్ సీఎం కేసీఆర్‌ను నిలదీశారు.
లక్షన్నర మంది రైతులను పొట్టన పెట్టుకున్న రాక్షసుడు కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం వచ్చాక 88వేల మంది రైతులను పొట్టనబెట్టుకున్నట్లు ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు. అనధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చాక లక్షా యాభై వేల మంది రైతులు చనిపోయారని రేవంత్ తెలిపారు. రైతులను పొట్టన బెట్టుకున్న రాక్షసుడు కేసీఆర్ అని అన్నారు. ఇలాంటి కేసీఆర్ రైతు రాజ్యం తెస్తామంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
బీఆర్ ఎస్‌కు వీఆర్ ఎస్ ఇవ్వబోతున్న తెలంగాణ ప్రజలు
తెలంగాణ ప్రజలు బీఆర్ ఎస్ కు వీఆర్ ఎస్ ఇవ్వబోతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక కేసీఆర్‌కు మిగిలేది శంకరగిరి మాన్యాలేనని తెలిపారు. కోటి ఎకరాలకు కాలువలతో నీళ్లిస్తే తెలంగాణలో వ్యవసాయ పనిముట్ల అవసరం ఉంటుందా? అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉంటే.. ఇప్పుడు అవి 30 లక్షలకు పెరిగాయన్నారు. నిజంగా కాలువల ద్వారా నీళ్లిస్తే.. పంపుసెట్లు ఎందుకు? ఉచిత విద్యుత్ ఎందుకు? అని ప్రశ్నించారు.
మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకే కేసీఆర్ డ్రామాలాడుతున్నాడని ఆరోపించారు. ప్రజలను మళ్లీ మోసం చేయడానికి బీఆర్ఎస్ మారువేషంలో వస్తున్నాడన్నారు. కేసీఆర్ ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రాదని రేవంత్ జోస్యం చెప్పారు. కేసీఆర్ పాలనకు ఇక కాలం చెల్లిందన్నారు.