విధాత: టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడంతోనే సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజానికంతో బంధం తెగిపోయిందని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రను ఆయన స్థానిక పానగల్ పచ్చల సోమేశ్వర ఆలయంలో పూజల అనంతరం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ తెలంగాణ పదాన్ని రద్దు చేసుకుని బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసుకున్న సీఎం కేసీఆర్ తెలంగాణతో తన బంధాన్ని స్వయంగా తెంచుకున్నాడని విమర్శించారు.
సజ్జల మాటలు ఎవరూ నమ్మరు..
స్వార్థ రాజకీయాల కోసమే టీఆర్ఎస్ పార్టీ, సజ్జల రామకృష్ణారెడ్డి కూడబలుక్కుని మళ్లీ సమైక్యాంధ్ర, తెలంగాణ అంటూ సెంటిమెంటును లేవనెత్తుతున్నారని విమర్శించారు. సజ్జల మాటలను ఎవరూ నమ్మరని రెండు రాష్ట్రాల ప్రజలు తిప్పి కొడతారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 2018 ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేస్తూ సమస్యల పరిష్కారాన్ని పక్క దోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
సుభిక్షంగా పాలించే సత్తా బీజేపీకే..
కేసీఆర్ అబద్ధపు మాటలను, బీఆర్ఎస్‌తో వేస్తున్నకొత్త డ్రామాలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు. సొంత రాష్ట్రాన్ని సక్కదిద్దే సత్తా లేని సీఎం కేసీఆర్ దేశాన్ని బాగు చేస్తా అంటుండని ఈటెల ఎద్దేవా చేశారు. దేశాన్ని, రాష్ట్రాలనుసురక్షితంగా సుభిక్షంగా పాలించే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని గుజరాత్ ఎన్నికలు మరోసారి నిరూపించాయన్నారు.
కానరాని నిరుద్యోగ భృతి..
తెలంగాణలో సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీతోనే సాధ్యమన్నారు. కేసీఆర్ హామీల మాటలు కోటలు దాటుతాయని కాళ్లు మాత్రం తంగేళ్లు దాటడం లేదన్నారు. రైతు రుణమాఫీ హామీ అమలు చేయకుండా రైతులను మోసం చేశారని, రుణమాఫీ అమలు చేయక బ్యాంకర్లు రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదన్నారు.
తెలంగాణ వస్తే మన బిడ్డలను విదేశాల స్థాయిలో బతికేలా చేస్తామని చెప్పిన కేసీఆర్ సొంత రాష్ట్రంలోనే వారిని నిరుద్యోగులుగా మార్చారన్నారు. ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వకపోగా ప్రస్తుతం ఒక్కో నిరుద్యోగి 1,50,000 పైన నిరుద్యోగ భృతి రావాల్సి ఉందన్నారు. దళిత బంధు, గిరిజన బంధు పేరుతో ఆ వర్గాలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
భ్రష్టు పట్టిన విద్యారంగం..
మహిళలకు 400 కోట్ల వడ్డీ లేని రుణాలు బకాయిలు పెట్టారన్నారు. తెలంగాణలో విద్యారంగం భ్రష్టు పట్టిపోయిందని పేద బిడ్డలకు హాస్టల్లో సరైన భోజనం కూడా అందడం లేదన్నారు. ఉద్యమ కాలంలో అటుకులు తిని ఉపవాసం ఉన్న కేసీఆర్ కు ఇప్పుడు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు.
మునుగోడులో వందల కోట్లు ఖర్చుపెట్టినా.. వేలాది హామీలు ఇచ్చినా చావు తప్పి కన్నులోట్ట బోయి గెలిచామనిపించుకున్నారని, నైతికంగా అక్కడ రాజగోపాల్ రెడ్డి ధర్మయుద్ధమే గెలిచారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేది కాషాయ జెండా మాత్రమేనన్నారు. నల్గొండ జిల్లాలో గ్రామ గ్రామానికి ప్రజా భరోసా యాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు.
బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలు
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజాగోస బీజేపీ భరోసాయాత్రలు సాగుతున్నాయని, ప్రజలు మార్పు కోరుతూ బీజేపీ వైపు చూస్తున్నారని రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగొని శ్రీనివాస్ గౌడ్, జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి ఆర్.ప్రదీప్ కుమార్, నల్గొండ ప్లోర్ లీడర్ బండారు ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాశోజు యాదగిరా చారి, జిల్లా కార్యదర్శి పోతేపాక లింగస్వామి, జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్, నల్గొండ అసెంబ్లీ కన్వీనర్ దాయమ్ భూపాల్ రెడ్డి, పట్టణ అద్యక్షులు మోరి శెట్టి నాగేశ్వర రావు, దాసరి వెంకన్న, కట్ట వెంకట్ రెడ్డి, చర్లపల్లి గణేష్, ఆవుల మధు, మండల పార్టీ అధ్యక్షులు, వివిధ మోర్చల నాయకులు పాల్గొన్నారు.