కేసీఆర్ వ్యూహం.. ఏం చేసినా దానికో లెక్కుంటది!
ఉన్నమాట: టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా దానికో లెక్కుంటుంది. మాట మాట్లాడినా, కాలు దీసి కాలేసినా అంతే. ప్రత్యర్థి పార్టీలే లక్ష్యంగా ప్రతిదీ సాగుతుంది. విపక్ష పార్టీలకు మైలేజీ వస్తుందని అనుకున్న ప్రతి సందర్భాన్నీ తనదైన శైలిలో దాన్ని హైజాక్ చేసేస్తారు. మీడియా, ప్రజలను మొత్తం తన వైపు చూసేలా చేస్తారు. మొత్తంగా తెలంగాణ సమాజం తన చుట్టే తిరిగేలా వ్యూహాలు రచించి పక్కాగా అమలు చేసి విజయ హాసం చేస్తారు.
విపక్షాలకు గుర్తింపు వచ్చే లోపే..
విపక్ష పార్టీలు ప్రచారంలోకి వచ్చి వాటికి ప్రజల్లో గుర్తింపు, ఆదరణ పోగవుతుందనుకున్న ప్రతీ సారి, కేసీఆర్ ప్రతి వ్యూహాలతో వాటిని నిర్వీర్యం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా చూస్తే… శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలును పొడిగించే రెండో దశను వచ్చే నెల 9న శంకుస్థాపన చేస్తారని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మెట్రో దశ పనులు ప్రారంభంతో పాటు, బీహెచ్ఈఎల్-లక్డీ కాపూల్, నాగోల్-ఎల్బీనగర్ మధ్య ట్రాఫిక్ రద్దీ తగ్గించటం కోసం మరో రెండు మార్గాలను నిర్మిస్తామని కూడా ఆయన ప్రకటించారు.
డిసెంబర్ 9 ఎందుకు..
ఉన్న పలాన ఈ ప్రారంభోత్సవాలకు డిసెంబర్ 9ని ముహూర్తంగా ఎంచుకోవటం యాధృచ్చికం ఎంత మాత్రమూ కాదు. సరిగ్గా అదే రోజున కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు. దేశ వ్యాప్తంగానే కాకుండా, తెలంగాణలోనూ కాంగ్రెస్ శ్రేణులు సోనియా పుట్టిన రోజును పెద్ద ఎత్తున నిర్వహించే అవకాశం ఉన్నది. దీంతో కొడిగడుతున్నకాంగ్రెస్‌కు అది పునరుజ్జీవంగా పనిచేసే అవకాశం ఉంటుందని కేసీఆర్ భావించి అదే రోజు రెండో దశ మెట్రో ప్రకటన ఉండేట్లు ప్లాన్ చేశారని సోషల్ మీడియాలో తెగ చర్చలు నడుస్తున్నాయి.
దీంతో తెలంగాణ సమాజమంతా ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా మెట్రో, నగరంలో మరో అతిపెద్ద రోడ్డు మార్గాల నిర్మాణం వైపే చూసేలా పకడ్బందీ వ్యూహం రచించారు. ఈ పరిస్థితుల్లో క్రాంగ్రెస్ ఎంత శ్రమించి సోనియా జన్మదినోత్సవాలను నిర్వహించినా ఈ ప్రారంభోత్సవాలకు వచ్చేంత మైలేజీ వచ్చే పరిస్థితి ఉండదు.
కేసీఆర్ వ్యూహాలకు చిత్తవుతున్న ప్రత్యర్థి పార్టీలు
ఇలాంటి వ్యూహం ఇదే మొదలు కాదు. మునుగోడు ఎన్నికల సందర్భంలో బీజేపీ అగ్రనేతలతో ఆ నియోగజక వర్గంలో భారీ బహిరంగ సభకు రాష్ట్ర బీజేపీ నేతలు ప్లాన్ చేస్తే., ఆ సభ కన్నా ఒక రోజు ముందే టీఆర్ఎస్ సభ నిర్వహించి ఆపార్టీని ఆత్మరక్షణలో పడేసింది. బీజేపీ ఎంత చేసినా మీడియాలో పతాక శీర్షికలు కాలేక పోవటంతో డీలా పడ్డాయి. ఆ తర్వాత ఏకంగా ప్రధాని మోదీ సభనే రద్దు చేసుకున్న పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే.. కోకొల్లలు. రాష్ట్ర అవతరణ నుంచీ నేటి దాకా కేసీఆర్ వ్యూహాత్మక అడుగులతో ప్రత్యర్థి పార్టీలు చిత్తై పోయాయి.
ఎంతో కాలం ఏమార్చలేరు..
విపక్ష పార్టీలు బలం పుంజుకోకుండా అడ్డుకోవటంలో కేసీఆర్ ఎల్లప్పుడూ జాగరూకతతో వ్యవహరిస్తున్నారు. ఎలాంటి సందర్భమైనా తనకు అనుకూలంగా మల్చుకోవటంలో విజయం సాధిస్తున్నారు. అయితే.. నిజాలు దాచి, కండ్లకు గంతలు కట్టి ఎవరైనా ఎంతో కాలం ప్రజలను ఏమార్చలేరు. కేసీఆర్ చేస్తున్న దురాక్రమణ రాజకీయం ఎంతో కాలం నడవదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.