Site icon vidhaatha

దసరా రోజు KCR జాతీయ పార్టీ.. జెండా రూపకల్పనలో స్పష్టత

విధాత: దసరా నాడు సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. దీని కోసం ఫామ్ హౌస్ వేదికగా కేసీఆర్ కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. దసరా రోజునే టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనున్నదని తెలుస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఏకాభిప్రాయంతో కేసీఆర్ ప్రకటన చేయనున్నారట.

పార్టీ ప్రకటన అనంతరం భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేయనున్నారు. ఈ బహిరంగ సభలోనే పార్టీ జెండా – ఎజెండాను సీఎం ప్రకటించనున్నారని సమాచారం. ఇక పార్టీకి సంబంధించిన జెండా రూపకల్పన విషయంలోనూ ఒక స్పష్టత వచ్చిందట. భారతదేశ చిత్ర పటంతో పాటు గులాబీ రంగు కూడా కేసీఆర్ జాతీయ పార్టీ జెండాలో మిళితమై ఉంటుందని తెలుస్తోంది.

ఇక పార్టీ ఎజెండా విషయానికి వస్తే… రైతులు, దళితులు, యువతను టార్గెట్ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలను హైలైట్ చేస్తూ కేసీఆర్ తమ జాతీయ పార్టీని ముందుకు తీసుకువెళ్లనున్నట్టు సమాచారం.

ఇక పార్టీ పేరు.. BRS భారత రాష్ట్ర సమితి అని టాక్ నడుస్తోంది కానీ క్లారిటీగా ఇదే అన్న విషయం మాత్రం తెలియడం లేదు. మొత్తానికి దసరాతో సస్పెన్స్ వీడే అవకాశం ఉన్నది.

Exit mobile version