Site icon vidhaatha

ఖమ్మం గుమ్మంలో రాజకీయ దుమారం..

విధాత, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో ఖమ్మం కేంద్రంగా రాజకీయ వేడి రగులుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు జిల్లాగా ఉన్న ఖమ్మం మెట్టును కేంద్రంగా చేసుకొని జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలకు పరిష్కారంగా ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు బి ఆర్ ఎస్ అధినేత ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పక్కా ప్రణాళిక రూపొందించారు.

ఖమ్మంలో ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభ సక్సెస్ అయిన విష‌యం తెలిసిందే. దీనికి ధీటైన జవాబుగా, ఖమ్మం జిల్లా గులాబీ పార్టీలో ఇటీవల డెడ్‌లైన్ దాటి కొనసాగుతున్న అంతర్గత అలజడికి పుల్ స్టాప్ పెట్టేందుకు, పక్క చూపులు చూస్తున్న అసమ్మతి వర్గాలకు గట్టి చెక్ పెట్టేందుకు ఒక ల‌క్ష్యాన్ని నిర్ణ‌యించారు. అందులో భాగంగానే ఆంధ్రాలో టిఆర్ఎస్ ఎంట్రీకి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనేందుకు ఖమ్మం జిల్లా కేంద్రంగా ఈ నెల 18న భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యాచరణ రూపొందించి అమలుకు సిద్ధమయ్యారు.

18న ఖమ్మంలో భారీ బహిరంగసభ

ఈ నెల 18న ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించి కెసిఆర్ తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సభకు కేసిఆర్ కాకుండా ఇతర రాష్ట్రాల నాయకులను, ముఖ్యమంత్రులను హాజరయ్యే విధంగా కార్యాచరణ రూపొందించారు. తెలంగాణలో భారత్‌ రాష్ట్ర సమితి ఆవిర్భావ బహిరంగ సభగా నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.

సభకు ఢిల్లీ, కేరళ,పంజాబ్ సీఎంల రాక

ఖమ్మంలో జరిగే ఈ సభకు ఢిల్లీ, పంజాబ్‌, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌, పినరయి విజయన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌లను ఆహ్వానించారు. కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌, అఖిలేష్‌లు అంగీకారం తెలపగా కేరళ సీఎం తమ నిర్ణయాన్ని సోమవారం వెల్లడించనున్నారు.

ఒకే దెబ్బ పలు లక్ష్యాలు

ఈ సభ సక్సెస్‌తో ఖమ్మం జిల్లాలో ఇటీవల సొంత పార్టీలో నెలకొన్న కొత్త కుంపట్లు రాజేసిన నాయకులకు గట్టిషాక్ ఇవ్వడంతో పాటు చంద్రబాబు రీఎంట్రీకి చెక్ పెట్టి, ఖమ్మం వేదిక నుంచి ఆంధ్ర రాజకీయాలలోకి ప్రవేశించి తన ప్రత్యేక ముద్రను ప్రదర్శించేందుకు పక్కా కార్యక్రమాన్ని రూపొందించినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అందుకే ఈనెల 18న జరిగే ఖమ్మం బహిరంగ సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఖమ్మంతో పాటు పరిసర జిల్లాల శ్రేణులను కూడా సమీకరించేందుకు అంతర్గత కార్యాచరణ రూపొందించారు. వీలైతే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ సభకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కూడా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒంటరి కావడంతో ఆయన కూడా తన బలాన్ని, పట్టును ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సభ సక్సెస్ కోసం పువ్వాడ అజయ్ పై కూడా అదనపు బాధ్యతలు అధినేత కేసిఆర్ మోపినట్లు సమాచారం.

ఇక 2018 ఎన్నికల్లో అనూహ్యంగా టిఆర్ఎస్ ఎంపీ టికెట్ నామా నాగేశ్వరరావుకి ఇచ్చి గెలిపించుకున్న కేసీఆర్ ఆ తదుపరి ఆయనను టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లోక్‌స‌భ పక్షనేతగా అవకాశం కల్పించారు. ఇటీవల ఆయన కొంత సైలెన్స్ తో పాటు గుంభనంగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఈ సభ సక్సెస్ లో తాను కూడా కీలక పాత్ర పోషించాలని కెసిఆర్ లక్ష్యం నిర్దేశించినట్లు ఖమ్మం బి ఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతుంది. అలాగే రాజ్యసభ అవకాశం కల్పించిన వద్దిరాజు రవిచంద్ర సహాయ సహకారాలు కూడా ఈ సభ విజయవంతానికి వినియోగించుకోనున్నట్లు చెబుతున్నారు.

సభపై ప్రగతిభవన్‌లో సమాలోచన

బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా 18న జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ పది రోజులపాటు సర్వశక్తులు వొడ్డనున్నారు .
ప్రగతి భవన్ లో సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ నెల 18న నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ భారీ బహిరంగసభ విజయవంతం, జిల్లాలో రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్టు చెబుతున్నారు.

కలవర పెట్టిన చంద్రబాబు సభ సక్సెస్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ గా విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ తెలుగుదేశం తెలంగాణ సెంటిమెంటు ముందు నిలబడలేకపోయింది. 2014 ఎన్నికల్లో పార్టీ కొన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని ఉనికిని చాటుకున్నప్పటికీ, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పయనించినా రాష్ట్రంలో పెద్దగా ఫలితాలు రాలేదు.

ఒక్క హైదరాబాద్, ఖమ్మం జిల్లాలో మినహా టిడిపి నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందలేకపోయారు. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తదుపరి జరిగిన రాజకీయ పరిణామాలలో పార్టీ ఫిరాయించి అధికార టీఆర్ఎస్ లో చేరిపోయి ఇప్పుడు బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

బీఆర్ఎస్‌తో బాబు రీఎంట్రీ

నిన్నటి వరకు ప్రత్యేక తెలంగాణ వాదిగా తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన కేసీఆర్ ఇటీవల తన పార్టీని బి ఆర్ఎస్ గా మార్పు చేయడంతో ‘సెంటిమెంట్’ హస్త్రాన్ని చేజేతులా వదులుకున్నట్లయ్యిందీ. ఈ పరిస్థితిని తమ కనుకూలంగా మలుచుకునేందుకు తిరిగి చంద్రబాబు నాయుడు ప్రయత్నించినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఇద్దరి ఎమ్మెల్యేలకు ప్రాతినిథ్యం వహించిన ఖమ్మం జిల్లాను తన రాజకీయ పునఃప్రవేశానికి ద్వారంగా ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు జిల్లాగా ఉండడం కూడా తమకు కలిసొచ్చే అంశంగా టిడిపి వర్గాలు అంచనా వేసినట్లు సమాచారం. పైగా నారా సామాజిక వర్గానికి చెందిన వాళ్లు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల ఖమ్మం జిల్లాలో చంద్రబాబు పర్యటన, భారీ బహిరంగ సభలు ఊహించిన దానికంటే ఎక్కువగా సక్సెస్ కావడం అధికార బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ రాజకీయ వర్గాలను ఒకింత ఆశ్చర్యానికి లోను చేసింది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా లో జరిగిన సభ సహజంగానే చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కూడా చంద్రబాబు తనదైన కీలక పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదనే చర్చకు ఊతమిచ్చింది.

గులాబీ పార్టీలో ఖమ్మం కలవరం

టిడిపి అధినేత నారా చంద్రబాబు ఖమ్మంలో నిర్వహించిన సభ సక్సెస్ కావడం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలవరపరిచినట్లు కూడా భావిస్తున్నారు. చంద్రబాబు పర్యటనను లోతుగా విశ్లేషించిన అనంతరం తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించేందుకు కెసిఆర్ అదే ఖమ్మాన్ని లక్ష్యంగా ఎంచుకున్నట్లు అంచనా వేస్తున్నారు.

పేరుకే కలెక్టరేట్ ప్రారంభం.. సభ ఏర్పాటే లక్ష్యం

నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేసీఆర్ వేదికగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కెసిఆర్ జిల్లా కలెక్టరేట్ భవనాల ప్రారంభం పేరుతో తన జిల్లాల టూర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టరేట్ల ప్రారంభంతో పాటు పార్టీ నూతన కార్యాలయాలను ప్రారంభించి, అనంతరం భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమాన్ని ఖమ్మంలో కూడా తన రాజకీయ పట్టును పెంచుకునేందుకు, ఆంధ్ర రాజకీయాల్లోకి ప్రవేశానికి మార్గంగా ఎంచుకున్నట్లు భావిస్తున్నారు.

ఈనెల 12న మానుకోట, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం నూతన కలెక్టరేట్ లను ప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించారు. చిత్రం ఏమిటంటే ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న నూతన కలెక్టరేట్ ను ఈ నెల 18న ప్రారంభించేందుకు నిర్ణయించడం గమనార్హం.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న రెండు కలెక్టరేట్లను ఒకేసారి ప్రారంభించేందుకు అవకాశం ఉన్నప్పటికీ మానుకోట, భద్రాద్రిలను ఒకరోజు, ఆ తరువాత 18న ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించేందుకు సిద్ధం కావడం లోనే రాజకీయ లౌక్యం దాగి ఉందని చెబుతున్నారు.

తుమ్మల, పొంగులేటి తీవ్ర అసంతృప్తి

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓటమిపాలైనప్పటి నుంచి మౌనంగా ఉంటున్నారు. ఇదే సమయంలో 2014లో వైఎస్సార్ సీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తదుపరి టిఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.

సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని కాదని 2018లో తెలుగుదేశం పార్టీలో ఉన్న నామా నాగేశ్వరరావును పార్టీలో చేర్పించి ఆయనకు ఖమ్మం టిఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇవ్వడంతో ఆయన విజయం సాధించారు. అప్పటినుంచి అప్పుడప్పుడు మౌనం, కొన్ని సందర్భాలలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న శ్రీనివాసరెడ్డి దాదాపు ఐదేళ్ల కాలం ఓపికగానే ఉన్నారు.

రానున్న ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించకుంటే తన రాజకీయ జీవితాన్ని తానే సమాధి చేసుకున్నట్లు భావించిన శ్రీనివాసరెడ్డి ఈ మధ్య గొంతు విప్పడం ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే అటు తుమ్మల ఇటు పొంగులేటి తమ గళం విప్పుతూ పార్టీ అధిష్టానానికి పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో భారీ సభలు నిర్వహిస్తూ అనుచరులు చేయిదాటి పోకుండా జాగ్రత్త వహిస్తున్నారు.

గులాబీ రాజకీయాల్లో తీవ్ర అలజడి

అసంతృప్తి స్థాయి కూడా బాగా పెరిగి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పెద్ద అలజడిని సృష్టించడమే కాకుండా రాష్ట్ర రాజకీయాలలో కూడా ఖమ్మం పరిణామాలు ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలు ఇతర జిల్లాల్లో కూడా షురూ అయితే పార్టీ లో అంతర్గత క్రమశిక్షణ దెబ్బతిని అసమ్మతి పేట్రేగిపోయే ప్రమాదం ఉందని కెసిఆర్, బి ఆర్ ఎస్ అధిష్టానం కలవరపడుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఏదో రూపంలో వర్గాలుగా విడిపోయి నేతలు పనిచేస్తున్నారు. దీనికి అసమ్మతి తోడైతే రానున్న ఎన్నికల్లో నష్టం వాటిల్లుతుందని గుర్తించిన కేసీఆర్ నివారణ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తుమ్మల, పొంగిలేటి వ్యాఖ్యలపై జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ తీవ్రంగా ప్రతిస్పందించడం గమనార్హం.

పొంగులేటి భద్రతను కూడా తగ్గించిన విషయం తెలిసిందే. సమస్యలు సద్దుమణిగించడంతోపాటు పరోక్ష హెచ్చరికలు జారీ చేసేందుకు రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి ఖమ్మంలో ఇటీవల పర్యటించారు. ప్రశాంత్ రెడ్డి వాఖ్యలు పరిస్థితిని మరింత దిగజార్చినట్లు భావిస్తున్నారు. అసలే అసంతృప్తితో రగిలిపోతున్న తుమ్మల, పొంగులేటి వర్గాలు ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్య లు పుండు మీద కారం చల్లినట్లు భావిస్తున్నారు.

దీనికి ప్రతిస్పందనగానే పొంగులేటి తాను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు బహిరంగంగా ప్రకటించి తన కార్యకర్తలకు అనుచరులకు బలమైన సంకేతాన్ని ఇచ్చినట్లు భావిస్తున్నారు. పార్టీ అదిష్టానానికి బలమైన హెచ్చరికలు జారీ చేసినట్లు చర్చించుకుంటున్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే రానున్న ఎన్నికల నాటికి అటు తుమ్మల గాని ఇటు పొంగిలేటికి గానీ సరైన స్థానం లభించకపోతే ప్రత్యామ్నాయంగా తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కొనసాగించడం కోసం విపక్ష పార్టీల్లోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ దిశగా సంకేతాలు వెల్లడిస్తున్నారు.

18న అమిత్ షాతో పొంగులేటి భేటీ

ఒకవైపు త్రిముఖ వ్యూహంతో కెసిఆర్ ప్రణాళికలు రచిస్తుండగానే ప్రత్యర్ధులు కూడా అప్రమత్తమైనట్లు భావిస్తున్నారు ఈనెల 18న ఖమ్మంలో సభ నిర్వహించేందుకు టిఆర్ఎస్ సన్నాహాలు చేస్తుండగా అదే రోజు అంటే ఈ నెల 18న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ ఖరారైనట్లు సమాచారం.

పార్టీలో చేరిక అంశం తదనంతర పరిణామాలపై చర్చ జరుతుందని చెబుతున్నారు. ఇప్పటికే పొంగులేటి తన పూర్వ రంగాన్ని సిద్ధం చేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు.ఇక తుమ్మల తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. తుమ్మల దారెటనే చర్చ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సాగుతుంది.

అసమ్మతి నేతలకు BJP వల

తుమ్మల, పొంగులేటి వారిద్దరూ కొంతకాలంగా బహిరంగ సంకేతాలను ఇస్తున్నారు. మరోవైపు బిజెపి నాయకులు తమ పార్టీలో చేర్పించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు తొందరపడకుండా తమ బలాబలగాలను సమీకరించుకుంటూ అసంతృప్తిని ప్రకటిస్తూనే ఖమ్మం జిల్లాలో తమ పట్టును కొనసాగించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

ఈ పరిణామాలు కూడా కేసీఆర్ కు కొరకరాని కొయ్యగా మారాయి. వీటన్నింటికీ ఏక పరిష్కారంగా భారీ సభకు ప్రణాళిక రూపొందించినట్లు భావిస్తున్నారు అయితే కేసీఆర్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయోననే చర్చ సాగుతోంది.

Exit mobile version