విధాత: ప్రధాని నరేంద్ర మోడీతో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త రాజకీయ చర్చలకు తెరలేపింది. మోడీతో భేటీ అనంతరం వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తను కేవలం మూసీ ప్రక్షాళన, విజయవాడ హైదరాబాద్ రహదారి పనులతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు అభివృద్ధి పనుల సాధన విషయమై మోడీతో చర్చించినట్లు తెలిపారు.
ఇదే సమయంలో మోడీతో చర్చించిన అన్ని అంశాలను తాను వెల్లడించలేనంటూ మోడీతో తన భేటీ వ్యవహారంలో వెంకట్ రెడ్డి కొంత సస్పెన్స్ మెయింటెన్ చేయడంపై ఇపుడు అందరి దృష్టి పడింది. తాను వెల్లడించలేని అంశాలు ఏమై ఉంటాయన్న ఉత్కంఠతను, చర్చను వెంకటరెడ్డి జనంలోకి వదిలారు. మోడీతో భేటీలో వెంకట్ రెడ్డి “వెల్లడించలేని అంశాల్లో ” అంతర్యమేమిటన్న దానిపై కాంగ్రెస్ శ్రేణులలో సహా వెంకట్ రెడ్డి అనుచర, రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చలకు ఆద్యం పోస్తుంది.
మోడీతో సాగిన అరగంట చర్చకు సంబంధించి వెంకట్ రెడ్డి వెల్లడించిన అభివృద్ధి పనుల విషయాన్ని పక్కనపెడితే తాను స్వయంగా చెప్పిన “వెల్లడించలేని అంశాలు” ఖచ్చితంగా ఆయన పార్టీ మార్పునకు సంబంధించిన అంశాలై ఉంటాయన్న వాదనకు బలం చేకూరుస్తున్నాయి. పార్టీ మారడంలో తనకు సంబంధించిన ఇబ్బందులు, షరతుల అంశాలను వెంకటరెడ్డి ఈ భేటీలో మోడీకి వివరించి, తనతో పాటు కాంగ్రెస్ నుంచి ఎవరెవరు బీజేపీలోకి రావచ్చన్న అంశాలను ఆయనకు వివరించారని.. అవే అంశాలు వెంకటరెడ్డి బయటకు చెప్పలేని అంశాలై ఉండవచ్చునన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీనికి తోడు ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అంశంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు వెంకట్ రెడ్డి సమాధానం చెప్పే క్రమంలో తాను కాంగ్రెస్లో ఏ కమిటీల్లోను సభ్యుడుగా లేనని, తనకు ఏ బాధ్యతలు లేవని, తాను ఇప్పుడు ఫ్రీ బర్డ్ అంటూ చెప్పడం, ఇటీవల తిరుపతి వెంకన్న సాక్షిగా ఎన్నికలకు నెల ముందు మాత్రమే రాజకీయ భవిష్యత్తుపై మాట్లాడతానని చెప్పిన తీరు వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కు దూరంగా జరగబోతున్నారన్న సంకేతాలకు నిదర్శనమన్న చర్చకు మరింత ఊతమిచ్చింది.
గతంలో వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తిరుపతిలోనే బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతూ తాను ఆ పార్టీలో చేరబోతున్న సంకేతాలను వెంకన్న సాక్షిగా తొలిసారిగా వ్యక్తం చేయడం ఈ సందర్భంగా గమనార్గం.
అదను చూసుకొని..
తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి అడుగుజాడలో తాను కూడా బీజేపీలో చేరేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొగ్గు చూపుతున్నారన్న విషయంపై తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. మోడీతో భేటీ వ్యవహారం పిదప వెంకటరెడ్డి పార్టీ మార్పు అంశం తద్యమన్న అంతర్గత చర్చలు గాంధీభవన్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
ఇంకోవైపు వెంకటరెడ్డి తన వెంట రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులను పలువురిని.. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వ్యతిరేకులను బీజేపీలోకి తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు పక్కాగా సఫలీకృతం అయ్యాకే బీజేపీలోకి వెళ్లాలని భావిస్తున్నందున ఆయన పార్టీ మార్పు ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు.
పార్టీ మార్పు దిశగా ఇప్పటికే వెంకటరెడ్డి పలువురు రాష్ట్ర కాంగ్రెస్ లోని అసంతృప్త ముఖ్య నేతలతో చర్చలు జరిపారని, మరికొందరితో ఇదే విషయమై చర్చలు కొనసాగిస్తున్నారని ఆయన వ్యతిరేక వర్గీయులు బహిరంగంగానే చెబుతున్నారు.ప్రధాని మోడీతో భేటీలో వెల్లడించలేని అంశాల జాబితాలో తనతో పాటు బిజెపిలోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్న టీ.కాంగ్రెస్ నేతల అంశం కూడా ఒకటై ఉండవచ్చన్న కథనాలు ఆ పార్టీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఏది ఏమైనా కాంగ్రెస్ లో తనని ఇబ్బంది పెట్టిన రేవంత్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చేలా తగిన అదను చూసి టీ.కాంగ్రెస్ ను దెబ్బ కొట్టి బిజెపిలో చేరి రాజకీయంగా తన సత్తా చాటాలని వెంకటరెడ్డి లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ దిశగా కోమటిరెడ్డి ఎప్పుడెప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని రాజకీయ, అనుచర వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.