Site icon vidhaatha

మునుగోడులో కాంగ్రెస్ గెలవదు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Venkat Reddy విధాత: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెల్వదు అంటే గెల్వదు అని ఆ పార్టీ సీనియర్ నాయకులు, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చిచెప్పారు. తన కుటుంబ సభ్యులతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వెంకట్ రెడ్డి అక్కడి ఎయిర్ పోర్టులో దిగగానే.. ఆయన అభిమానులు, మద్దతుదారులు స్వాగతం పలికారు. ఇక ఎయిర్ పోర్టులోనే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మునుగోడులో నేను ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీ గెల్వదు. నేను పోయి ప్రచారం చేసినా.. ఓ పది ఓట్లు పెరుగుతయి కానీ.. కాంగ్రెస్ గెలవదు. ఫైనాన్షియల్‌గా మనం గెలవలేం. వాని పైసలు మనం పెట్టలేం. ఎంపీగా మరియు ఎమ్మెల్యేగా 25 ఏళ్లుగా కాంగ్రెస్‌ కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నానని వెల్లడించారు. రిటైరైపోతా హ్యాపీగా.. పాదయాత్ర చేద్దామంటే కాంగ్రెస్ పార్టీలో ఒక్క గ్రూపా? అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

మునుగోడులో బీజేపీ గెలిస్తే.. ఈ దెబ్బతో పీసీసీ ప్రెసిడెంట్ నేనే అవుతా.. తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తా. మన పార్టీ అధికారంలోకి వచ్చాక ఏదైనా ఉంటే నేనే చూసుకుంటా.. ఆ త‌ర్వాత ఏమైనా ప‌నులు ఉంటే చూసుకుందాం. చచ్చినా బతికిన రాజగోపాల్ రెడ్డి సాయం చేస్తూ ఉంటారు. కాబ‌ట్టి ప్ర‌స్తుతం పార్టీల‌కు అతీతంగా రాజ‌గోపాల్ గెలుపు కోసం ప‌నిచేయాల‌ని ఓ కాంగ్రెస్ కార్యకర్తకు నిన్న కోమటిరెడ్డి ఫోన్ చేసి చెప్పిన సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వెంకట్ రెడ్డి నవంబర్ 7వ తేదీన తిరిగి ఇండియాకు రానున్నారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ పక్కా ప్రణాళిక ప్రకారమే కోమటిరెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడని పార్టీ వర్గాలు భావిస్తున్న సంగతి తెలిసిందే. తమ్ముడి గెలుపునకు వెంకట్ రెడ్డి ఇలా ప్లాన్ చేశారని అంటున్నారు. నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ జరగనుండగా.. 6న ఫలితాలు వెలువడనున్నాయి.

Exit mobile version