విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: కోరమీసాల కొమురవెల్లి మలన్న కల్యాణం అంగరంగ వైభవంగా సాగింది. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలతో శోభాయమానంగా.. మల్లికార్జునిడి వివాహం జరిగింది. ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్‌రావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మల్లన్న కల్యాణాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మంత్రి తన్నీరు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి మెదక్ పార్లమెంట్ సభ్యులు సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి కల్యాణంలో పాల్గొన్నారు. కళ్యాణోత్సవం సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలను అమాత్యులతో కలిసి సమర్పించారు.
కల్యాణం.. కమనీయం..
కోరమీసాల కొమురవెల్లి మల్లన్న కల్యాణం ఆదివారం కమనీయంగా జరిగింది. ముక్కోటి దేవతలు, పంచభూతాల సాక్షిగా, వీరశైవ పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయ ధ్వానాలు, మేళతాళాల చప్పుళ్లు మధ్య కేతలమ్మ, మేడలాదేవిని మల్లన్న వివాహమాడాడు.
ఆలయ ప్రాంగణంలోని తోటబావి ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై ఈవో బాలాజీశర్మ ఆధ్వర్వంలో, కాశీ జ్ఞాన సింహాసన మహా పీఠశాఖ వీరశైవ పీఠాధిపతి మణికంఠ శివాచార్య మహాస్వామి పర్యవేక్షణలో వీరశైవాగమశాస్త్రం ప్రకారం కల్యాణం నిర్వహించారు.
కన్నుల పండుగగా కల్యాణం
దేవదేవుల ఆహ్వాన పూజానంతరం అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను గర్భాలయంలో నుంచి సంప్రదాయబద్ధంగా పల్లకీలో ఊరేగిస్తూ మహిళల కోలోటాల నడుమ భాజాభజంత్రీల మధ్య కల్యాణ మంటపానికి తీసుకువచ్చారు. ఆనవాయితీ ప్రకారం గ్రామపంచాయతీ తరఫున సర్పంచు సార్ల లత, కిష్టయ్య దంపతులు, ఒగ్గు పూజారులు పట్టువస్ర్తాలు, పుస్తెమట్టెలు, తలంబ్రాలు అందజేశారు.
గర్భాలయంలోనూ మల్లన్నకు శాస్ర్తోక్తంగా కల్యాణాన్ని నిర్వహించారు. కన్యాదాతలుగా మహదేవుని మనోహర్, మమత దంపతులు, కన్యా గ్రహీతలుగా పడిగన్నగారి వంశస్తులైన పడిగన్నగారి మల్లయ్య, బాలమణి దంపతులు వ్యవహరించారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, తల్రంబాలను అందచేశారు.
మల్లన్నకిజై అంటూ భక్తులు చేసిన జయజయ ధ్వానాలతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. అనంతరం ముత్యాల తలంబ్రాలు, ఒడిబియ్యం పోశారు. పట్టువస్ర్తాలతో ధగధగలాడుతున్న దేవతామూర్తులు భక్తులకు దర్శనమిచ్చారు. కల్యాణాన్ని తిలకించిన భక్తులు మల్లన్న నామస్మరణతో పులకించిపోయారు.
భగవంతుడి ఆశీర్వాదంతోనే సకల విజయాలు: మంత్రి
గతంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కొమురవెళ్లి మల్లన్న స్వామి కల్యాణం ఘనంగా వైభవంగా జరిగిందని మంత్రిహరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొమురవెళ్లి మల్లన్న ఆలయ అభివృద్ధికై రూ.30 కోట్లు కేటాయించారన్నారు.
ఇప్పటికే సీఎం కేసీఆర్ మల్లన్న స్వామివారిని రెండుసార్లు దర్శించుకున్నారన్నారు. వచ్చే యేటా మల్లన్న స్వామి కల్యాణం వరకు కేతమ్మ, మేడమ్మల అమ్మవార్లకు ఒక కిలో స్వర్ణ కిరీటం తయారు చేయిస్తామని మంత్రి హరీశ్ వెల్లడించారు. కొమురవెళ్లి మల్లన్న కల్యాణం కోసం అశేష జన వాహిని సమక్షంలో హాజరుకావడం చాలా సంతోషకరమన్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొమురవెళ్లి మల్లన్నకు కిలోన్నర స్వర్ణ కిరీటం చేయించడం సంతోషమన్నారు.
కొందరు ఎన్ని కుట్రలు చేసినా మల్లన్న దయతో మల్లన్న సాగర్ అనుకున్న సమయానికి పూర్తి చేసుకున్నామన్నారు. మల్లన్న దేవుడి దయతో, సీఎం కేసీఆర్ కృషితో మూడేళ్లలో మల్లన్న సాగర్ పూర్తి చేసుకుని పలు జిల్లాలకు సాగునీటితో సస్యశ్యామలం చేయడం జరుగుతుందన్నారు.
మల్లన్న సాగర్ ప్రారంభం చేసి గోదావరి జలాలతో సీఎం కేసీఆర్ మల్లన్న పాదాలు కడిగి మొక్కులు తీర్చుకున్నారన్నారు. రూ.11కోట్లతో భక్తులకు కావాల్సిన క్యూలైన్లు, 50 గదులతో సత్రం, కోనేరు అభివృద్ధి, దేవాలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు.
హాజరైన ప్రముఖులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు మల్లన్న కల్యాణోత్సవానికి హాజరై స్వామి వారికి బంగారు కిరీటం, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను వెండి పల్లెంలో నెత్తిన పెట్టుకుని సంప్రదాయ బద్దంగా మేళ, తాళలతో వచ్చి సమర్పించారు.
బృహన్మఠాదీశుడు సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో స్వామి వారి కల్యాణం జరిగింది. మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు మల్లన్న కల్యాణంతో ప్రారంభమయ్యాయి. యేటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు స్వామి వారి కల్యాణం జరగడం ఆనవాయితీగా వస్తున్నది.
కల్యాణానికి రాష్ట్ర మంత్రులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక జనగామ శాసన సభ్యులు శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి రోజా రాధాకృష్ణ శర్మ, రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక సదుపాయ అభివృద్ది సంస్థ చైర్మన్ శ్రీఎర్రోల్ల శ్రీనివాస్, రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.