Site icon vidhaatha

KTR | బండి, రేవంత్‌లపై కేటీఆర్‌ రూ.100 కోట్ల దావా.. పరువు నష్టం కలిగించారని లీగల్‌ నోటీస్‌

విధాత: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ఉదంతంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి కే తారకరామారావు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు.

వారు చేసిన ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగిందని పేర్కొంటూ వంద కోట్లకు వారిపై పరువు నష్టం దావా వేశారు. వారిద్దరికీ లీగల్‌ నోటీసు పంపనున్నట్టు కేటీఆర్‌ కొద్ది రోజుల క్రితం మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే.

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ఉదంతంలో రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నారని కేటీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంలో తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చిల్లరమల్లర ప్రయత్నాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

మొత్తం నియామకాల ప్రక్రియనే అడ్డుకునేందుకు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం లీగల్‌ నోటీసులు జారీ చేసిన కేటీఆర్‌.. తనపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో వంద కోట్ల పరువు నష్టం దావాను ఎదుర్కొనాలని నోటీసులో పేర్కొన్నారు.

Exit mobile version