- 72శాతం నిధులతో ఆర్థికంగా అన్ని పార్టీలకు అందనంత ఎత్తులో బీజేపీ
విధాత: రాబోయే సాధారణ ఎన్నికల నాటికి బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటమే కాదు, అధికారాన్నే హస్తగతం చేసుకొనేందుకు కాంగ్రెస్ తీవ్ర కసరత్తులు చేస్తున్న పరిస్థితుల్లో ఆర్థిక జవసత్వాల స్థితి మాత్రం ఆ ఆశలపై నీళ్లు చల్లుతున్నది.
ప్రజాస్వామ్య సంస్కరణ సంస్థ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్-ఏడీఆర్) ప్రకారం… 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలకన్నా కాంగ్రెస్‌కు తక్కువ స్థాయిలో ఎలక్ట్రోరల్ ఫండ్స్ రావటమే దీనికి కారణం.
ఏడీఆర్ రిపోర్టు ప్రకారం… బీజేపీకి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో రూ. 351 కోట్లు అందాయి. కాంగ్రెస్‌కు అందినవి 18.44 కోట్ల రూపాయలు మాత్రమే. మరో వైపు స్థానిక పార్టీలుగా ఉన్న నిన్నటిదాకా టీఆర్‌ఎస్ నేడు బీఆర్‌ఎస్‌కు రూ. 40 కోట్లు, సమాజ్ వాదీ పార్టీకి రూ. 27 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 21.12 కోట్లు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రూ. 20 కోట్లు ముట్టాయి.
ఈ నిధులన్నీ కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్న సామాజిక సేవా స్వచ్ఛంద సంస్థలు, ఎలక్ట్రోరల్ ట్రస్ట్‌ల నుంచి పార్టీలకు అందాయి. ఇవి ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చట్టబద్ధంగా అందినవిగా ఏడీఆర్ తెలిపింది. ఈ నిధులన్నీ లాభాపేక్షలేని ఎలక్ట్రోరల్ ట్రస్టుల నుంచి వివిధ పార్టీలకు అందిన నిధులని తెలియజేసింది.
అంటే.. కాంగ్రెస్ కన్నా బీజేపీకి అందిన నిధులు 19రెట్లు. కాంగ్రెస్ మినహా దేశంలోని మిగతా ప్రధాన 9 పార్టీలకు వచ్చిన నిధులకన్నా కూడా బీజేపీకి రెండున్నర రెట్లు ఎక్కువ నిధులు రావటం గమనార్హం.
జాతీయోధ్యమ సారథిగా, వందేండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక ప్రాంతీయ పార్టీలకన్నా తక్కువ ఎన్నికల నిధులు అందటం బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను చూస్తున్నవారికి ఆశాభంగం అనక తప్పదు. ఎందుకంటే… ఎన్నికల్లో గెలవ డానికి పార్టీకి ఉన్న ఆర్థిక శక్తి కూడా కీలకమే.
మరీ ముఖ్యంగా ఇటీవలి ఎన్నికల సరళి చూస్తే.. పార్టీ ఆర్థికంగా శక్తివంతంగా లేకపోతే.. ఎన్నికల్లో గెలుపొందటం అసాధ్యమని తెలుస్తుంది. ఆ అర్థంలో కాంగ్రెస్ ఆర్థికంగా ఎంత బలహీనంగా ఉన్నదో తేటతెల్లం అవుతున్నది.
మరో వాదన కూడా ఉన్నది. ఎప్పుడైనా ఎక్కడైనా వ్యాపార కార్పొరేట్ సంస్థలు ఎన్నికల్లో గెలిచే పార్టీకి, లేదా ప్రభుత్వ విధాన నిర్ణయాలను తమ రాజకీయ శక్తితో ప్రభావితం చేయగలిగే పార్టీలకే ఎన్నికల నిధులు ఇస్తాయి. జాతీయ పార్టీగా బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా తానేనని చెప్తున్న కాంగ్రెస్‌కు ప్రాంతీయ పార్టీలకన్నా తక్కువ నిధులు వచ్చాయంటే.. కార్పొరేట్ శక్తుల దృష్టిలో కాంగ్రెస్‌ను ఓ ప్రభాశీల శక్తిగా కూడా గుర్తించటం లేదా! అన్నదే ఆశ్చర్యకరం.
ఈ ఎలక్ట్రోరల్ నిధులన్నీ దేశంలోని 89 ప్రముఖ వ్యాపార, కార్పొరేట్ సంస్థలు ఆయా పార్టీలకు సమకూర్చినవి. కార్పొరేట్, వ్యాపార సంస్థలు సామాజిక బాధ్యత పేర ఏటా కొంత నిధిని సామాజిక సేవా కార్యక్రమాలకు, ఎలక్ట్రోరల్ ట్రస్టుల పేరుతో రాజకీయ పార్టీలకు నిధులు అందజేస్తుంటాయి.
దేశంలోని కార్పొరేట్ సంస్థలేవీ కాంగ్రెస్‌కు నిధులను ఇవ్వని స్థితి ఉన్నదంటే.. కాంగ్రెస్ భవిష్యత్తు అంధకారమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.