Site icon vidhaatha

రామ మందిరం ప్రాణప్ర‌తిష్ఠ‌.. ఎల్‌కే అద్వానీ దూరం..!

రామ జ‌న్మ‌భూమి ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర పోషించిన బీజేపీ సీనియ‌ర్ నేత‌లు ఎల్‌కే అద్వానీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషీ.. రామ‌మందిరం ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మానికి దూరంగా ఉన్నారు. ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు కూడా ఎల్‌కే అద్వానీ అయోధ్య‌కు చేరుకోలేదు. తీవ్ర‌మైన చ‌లి ఉండ‌టం కార‌ణంగా, వ‌య‌సు రీత్యా అద్వానీ(96) హాజ‌రు కాలేద‌ని తెలుస్తోంది. అద్వానీ అయోధ్య‌కు రాక‌పోవ‌డంపై కొంత మంది బీజేపీ నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.


ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ రామమందిర ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేద‌ని శ్రీరామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు గ‌తంలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇరువుల నేతల వయసు, ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని వారిని ప్రారంభోత్సవానికి రావొద్దని కోరామని, అందుకు వారు అంగీకరించినట్టు ట్రస్ట్‌ తెలిపింది.


బీజేపీ సీనియ‌ర్ నేత ఎల్‌కే అద్వానీని జ‌న‌వ‌రి 22న అయోధ్య‌కు తీసుకురావాల‌ని బీజేపీ మాజీ ఎంపీ, రామ్ టెంపుల్ మూవ్‌మెంట్ సీర్ రామ్ విలాస్ వేదాంతి ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఇందుకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ను రామ్ విలాస్ కోరారు. రామ‌మందిరం ప్రారంభోత్స‌వానికి అద్వానీ త‌న క‌ళ్ల‌తో చూడాల్సిందేని, ఇది దేశం కోరిక మాత్ర‌మే కాదు.. ప్ర‌పంచంలోని ప్ర‌తి హిందువు కోరిక అని వేదాంతి చెప్పారు.


ఎందుకంటే రామ్ టెంపుల్ మూవ్‌మెంట్‌లో అద్వానీ పాత్ర ఎంతో ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌నుగ‌డ‌కు, ఈ స్థాయికి చేరుకోవ‌డానికి అట‌ల్ బీహారీ వాజ‌పేయి, ఎల్‌కే అద్వానీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి ఎంతో కృషి చేశార‌ని వేదాంతి స్ప‌ష్టం చేశారు.


సోమ్‌నాథ్ నుండి అయోధ్య వరకు తన ‘రథయాత్ర’ ద్వారా అద్వానీ రామ మందిర ఉద్యమానికి భారీ సహకారం అందించారు. రామ్ లల్లాకు పవిత్ర ప్రతిష్ఠాపన జరుగుతున్నప్పుడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అద్వానీని తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని తాను కోరుకుంటున్నాన‌ని వేదాంతి అన్నారు.

Exit mobile version