- మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
- బాధిత కుటుంబ సభ్యుల హర్షం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లాలో కిడ్నాప్, ఆపై హత్య చేసిన తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు మందా సాగర్‌కు శుక్రవారం కోర్టు మరణ శిక్ష విధించింది. 2020 అక్టోబర్ 18న ఈ సంఘటన జరిగింది.
ఈ కేసులో ఇరువైపులా వాదనలు విని, సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్ర శేఖర్ ప్రసాద్ శుక్రవారం తీర్పునిచ్చారు. బాలుడు దీక్షిత్ రెడ్డి హత్య కేసు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో నిందితుడు మంద సాగర్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, బాధితకుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయ దేవత, పోలీస్ చిత్రపటాలకు దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు క్షీరాభిషేకం చేశారు.