Maharashtra
- ఏండ్లుగా చేతకాని కేంద్ర ప్రభుత్వాలు
- అందుకే దేశం ఇంకా బాగుపడ లేదు
- ఇందుకు మరో పోరాటం చేయాల్సిందే
- ఇప్పటికైనా కొత్త పంథాలో నడవాలి
- మహారాష్ట్ర పర్యటనలో సీఎం కేసీఆర్
- విఠలేశ్వరస్వామి ఆలయ సందర్శన
విధాత: బీఆర్ఎస్ పార్టీ మరే ఇతర పార్టీకి ఏ-టీం కాదు, బీ-టీం కాదని, తమది కిసాన్ టీం అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో అమలు జరుగుతున్న జలనీతిని మార్చి నయా భారత్ను నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న జలవిధానాన్ని బంగాళఖాతంలో కలపాలన్నారు.
మహారాష్ట్య పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం పండరీపూర్లోని రుక్మిణీ సమేత విఠలేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి పాదాలను పసుపు కుంకుమలతో అలంకరించి మొక్కులు చెల్లించారు.
అనంతరం సోలాపూర్ జిల్లాలోని సర్కోలీ గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఎన్నో యేండ్లుగా అధికారం చెలాయిస్తున్న ప్రభుత్వాల చేతగానితనంతో స్వాతంత్రం వచ్చి యేండ్లు గడుస్తున్నా దేశం ఇంకా బాగుపడలేదన్నారు. అందుకే మరో పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
దేశంలోని చిన్న గ్రామాల నుంచి పెద్ద నగరాల వరకు విద్యుత్ అందించే సామర్థ్యం ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వాల చేతగాని తనమే నేటి విధ్యుత్ సమస్యలకు కారణం అన్నారు. దేశం ఇప్పటికైనా సరికొత్త పంథాలో నడవాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్.. మనకంటే చిన్న దేశాలు ఎంతో అభివృద్ధిని సాధించాయని చెప్పారు. పొరుగు దేశమైనా చైనా ఎక్కడుంది ? మనమెక్కడ ఉన్నాం అంటూ ప్రశ్నించారు.
ఒక్క చాన్స్ ఇవ్వండి…
మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, శివసేన, బీజేపీలకు అవకాశం ఇచ్చారని, బీఆర్ఎస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. రత్నగర్భ అయిన మహారాష్ట్రకు ఏం తక్కువైందన్నారు. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు జరగడం లేదన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తక్కువ సమయంలోనే తెలంగాణ ఎంతో అభివృద్ధిని సాధించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సత్తా ఉంటే మహారాష్ట్రలో ప్రతి ఎకరాకు సాగు నీరు ఇవ్వవచ్చాన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర కోసం ఏర్పాటైన పార్టీ తమది కాదన్నారు.
దేశంలో ఉన్న సమస్యలన్నింటికీ.. పరివర్త భారత్ కావాలన్నారు. కోట్లాది ఎకరాల సాగు భూమికి నీరును అందిస్తామని.. ఔరంగబాద్లో ఎనిమిది రోజులకోసారి నీళ్లు వస్తాయని, సోలాపూర్లో ఐదురోజులకోసారి నీళ్లు వస్తాయన్న కేసీఆర్.. అకోలాలో నీళ్లు రావడం లేదని గుర్తు చేశారు.
జలవిధానాన్ని బంగాళఖాతంలో కలపాలి…
ప్రస్తుత జలవిధానాన్నితీసి బంగాళాఖాతంలో వేయాలన్నారు సీఎం కేసీఆర్. కేంద్రం జలనీతిని మార్చి నయా భారత్ను రూపొందిస్తామన్నారు. దేశంలో నీళ్లు లేవంటే అది మరో మాట అవుతుందని, కానీ నేతల మాయమాటలు చెప్పి నీళ్లు ఇవ్వలేకపోయారని ఆరోపించారు.
దేశంలో సోలార్ పవర్, హైడ్రో పవర్, థర్మల్ పవర్కు ఎలంటి సమస్య లేదన్నారు. బొగ్గు రిజర్వులు బిలియన్ల టన్నుల్లో ఉన్నాయని, కావాల్సినంత బొగ్గు నిల్వలు ఉన్నప్పుడు విద్యుత్ సమస్య ఎందుకు వస్తుందని నిలదీశారు. హైడ్రో, సోలార్, బొగ్గును సమతుల్యం చేస్తే, అప్పుడు దేశవ్యాప్తంగా విద్యుత్ సమస్యలే రావన్నారు. 125 సంవత్సరాలకు కావాల్సినంత బొగ్గు మన దగ్గర ఉందన్నారు.
రైతుల కోసం 24 గంటల పాటు ఉచిత విద్యుత్ను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. రైతులంతా ఏకం అయితేనే మార్పు వస్తుందన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ సర్కారు వస్తే తెలంగాణలో అమలు జరుగుతున్న అన్ని సంక్షేమ పథకాలను మహారాష్ట్రలో కూడా అమలు చేస్తామన్నారు. అంతకు ముందు పలువురు నాయకులను బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.