కెనడా (Canada) లోని తమ అనుబంధ పరిశ్రమ అయిన రెసాన్ ఏరోస్పేస్ కార్పొరేషన్‌ను మూసేస్తున్నామని భారత పారిశ్రామిక దిగ్గజం మహింద్ర అండ్ మహింద్ర (Mahindra & Mahindra) ప్రకటించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.
తమ రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించినప్పటికీ.. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. మూసివేతకు అసలు కారణంపై స్పష్టత రావాల్సి ఉంది. కెనడా కార్పొరేషన్ నుంచి మూసివేత ప్రక్రియకు అనుమతులు పొందాం. దీనిపై సమాచారం ఉంది అని ఈ నెల 20న దాఖలు చేసిన రెగ్యులేటరీ నోట్‌లో మహింద్రా సంస్థ పేర్కొంది.
ఈ మేరకు అదే తేదీ నుంచి ఈ కంపెనీ ఉనికిలో లేదని భావించాలని తెలిపింది. మరోవైపు ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్ ప్రభుత్వాన్ని దోషిగా చూపెడుతూ కెనడా ప్రధాని ట్రూడో మరోసారి ఆరోపణలు గుప్పించారు. ఈ విషయానికి సంబంధించి తమ వద్ద బలమైన కారణాలు ఉన్నాయని తెలిపిన ఆయన.. బలమైన సాక్ష్యాలను మాత్రం బహిరంగపరచడం లేదు.
ట్రూడో ఆరోపణలను భారత్ నిర్ద్వంద్వంగా ఖండించింది. అంతే కాకుండా కెనడా రాయబార కార్యాలయంలో ఒక దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. కెనడా వెళ్లాలనుకుంటున్న, ఇప్పటికే అక్కడ ఉంటున్న భారతీయులకు ముప్పు పొంచి ఉందని.. జాగరూకతతో ఉండాలని హెచ్చరించింది.