Mallareddy vs. Sudhir Reddy |
విధాత: బిఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గం మేడిపల్లి మండలం బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డికి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డికి మధ్య చోటు చేసుకున్న వాగ్వివాదం బిఆర్ఎస్ పార్టీలో నెలకొన్న లుకలుకలకు అద్దం పట్టింది.
మంత్రి మల్లారెడ్డి ఆయనతోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగినట్లుగా చెప్పుకుంటున్నారని, తాను నియోజకవర్గానికి చేసిన సేవలను చెప్పడం లేదని సుధీర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలో సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు పార్టీ కోసం పనిచేస్తుంటే మల్లారెడ్డి తమను పట్టించుకోవడం లేదన్నారు.
మేడ్చల్ నియోజకవర్గం అభ్యర్థి తానేనంటూ మల్లారెడ్డి ప్రకటించుకోవడం ఏమిటని, అధిష్టానం ఏమైనా ఆయన పేరు ప్రకటించిందా అంటూ ప్రశ్నించారు. దీంతో మల్లారెడ్డి ఆగ్రహంతో సుధీర్ రెడ్డి మాట్లాడుతుండగానే ఆయన చేతిలోని మైకును లాక్కోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
వేదికపై వారి మధ్యన ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వారిద్దరికి సర్ది చెప్పి శాంతింపజేశారు. కార్యకర్తల ముందే ఇద్దరు నేతలు పరస్పరం వాదులాడుకున్న ఘటనతో పార్టీలో నెలకొన్న విభేదాలు రచ్చకెక్కినట్లయ్యింది.