విధాత: ఇది హృదయ విదారక ఘటన. ఓ వ్యక్తి ఆర్థికంగా నష్టపోయాడు. భార్య, ఐదుగురు పిల్లలను పోషించడం అతనికి కష్టంగా మారింది. అప్పులు కూడా పుట్టడం లేదు. పోషణ భారంగా మారడంతో, భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అటు ఆర్థిక కష్టాలు, ఇటు గొడవలతో సతమతమవుతున్న ఆ వ్యక్తి గంజాయికి బానిస అయ్యాడు. గంజాయి మత్తులో భార్య, ఐదుగురు పిల్లలను గొడ్డలితో నరికేశాడు. అనంతరం అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తమిళనాడు తిరువణ్ణమలై జిల్లాలోని ఒర్నత్తవాడి గ్రామానికి చెందిన పళనిసామి(45)కి భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. అయితే పళనిసామి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అది కూడా భూమిని కౌలుకు తీసుకొని. అయితే పంటలో ఆశించినంత లాభం రాలేదు. కరోనా కూడా విజృంభించడంతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయింది. అప్పులు కూడా పుట్టడం లేదు.
కుటుంబాన్ని పోషించడం పెద్ద సవాల్‌గా మారింది పళనిసామికి. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న పళనిసామి గంజాయికి బానిస అయ్యాడు. నిన్న రాత్రి కూడా గంజాయి సేవించి ఇంటికొచ్చాడు. భార్యతో గొడవ పెట్టుకున్న పళనిసామి సహనం కోల్పోయాడు.
గంజాయి మత్తులో భార్య, ఐదుగురు పిల్లలపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గొడ్డలి దాడిలో భార్య, ముగ్గురు అమ్మాయిలు, కుమారుడు ప్రాణాలు కోల్పోగా, 9 ఏండ్ల కూతురు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.
స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో బాధ పడుతున్న అమ్మాయి(9)ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు