Manipur
ఇంఫాల్: మణిపూర్‌లో శుక్రవారం హైడ్రామా చోటు చేసుకున్నది. రెండు నెలలుగా రగులుతున్న మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడంలో విఫలమయ్యారంటూ విమర్శలు ఎదుర్కొన్న ముఖ్యమంత్రి బిరేన్‌సింగ్.. రాజీనామా చేస్తారని, సాయంత్రం గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా కోరారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా.. తీరా సమయం వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది.
రాజీనామా లేఖను సమర్పించేందుకు గవర్నర్ నివాసానికి బయల్దేరిన బిరేన్.. తన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడిన అభిమానుల నినాదాలతో మనసు మార్చుకున్నారు. గవర్నర్ నివాసానికి వెళ్లకుండానే తిరుగు పయనమయ్యారు. ఇంఫాల్‌లోని సీఎం నివాసం వద్దకు వందల సంఖ్యలో చేరుకున్న ఆయన మద్దతుదారులు, ప్రత్యేకించి మహిళలు మానవ హారంగా ఏర్పడి.. బిరేన్‌సింగ్ గవర్నర్ నివాసానికి వెళ్లకుండా అడ్డు నిలిచారు.
రాజీనామా చేయనిచ్చేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఆయన నివాసం నుంచి బయటకు వచ్చిన ఇద్దరు మంత్రుల వద్ద.. చిరిగిపోయిన స్థితిలో ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా పత్రం కనిపించింది. రిజర్వేషన్ల విషయంలో మైతేయి, కుకీ గిరిజన తెగల మధ్య చెలరేగిన ఘర్షణలతో మణిపూర్ రెండు నెలలుగా మండిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి బిరేన్‌సింగ్ మైతేయి తెగకు చెందినవారు.
పార్టీ పెద్దల ఆదేశాలతో బిరేన్‌సింగ్ శుక్రవారమే రాజీనామా చేయబోతున్నారని స్థానిక పత్రిక సంగాయి ఎక్స్‌ప్రెస్ ఉదయమే బాంబు పేల్చింది. బిరేన్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలే కాకుండా.. సొంత పార్టీ నేతల నుంచి కూడా డిమాండ్లు ఉన్నాయి. బిరేన్‌సింగ్‌కు గురువారం రాత్రి న్యూఢిల్లీ నుంచి పలు ఫోన్ కాల్స్ వచ్చాయని, అందులో రాజీనామా చేయాలన్న సూచనలు ఉన్నాయని, లేని పక్షంలో కేంద్ర పాలన విధించే ఆప్షన్ ఇచ్చారని సంగాయి ఎక్స్‌ప్రెస్ పేర్కొన్నది.
పార్టీ పెద్దల ఆదేశాలను పాటించేందుకు బిరేన్‌సింగ్ సిద్ధపడ్డారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గవర్నర్ ఉయికే ఢిల్లీ పర్యటన అనంతరం రెండు రోజులకు ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. ఆ పర్యటనలో గవర్నర్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలుసుకున్నారు. మణిపూర్‌లో పరిస్థితిని, అదుపు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు.
ఈ నేపథ్యంలో రాజీనామా చేస్తారా? లేదా కేంద్ర పాలన విధించమంటారా? అన్న ఆప్షన్ ఇవ్వగా.. బిరేన్ రాజీనామా చేసేందుకే సిద్ధపడ్డారు. కానీ.. చివరి నిమిషంలో అధిష్ఠానం ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ రాజీనామాకు నిరాకరించడం రానున్న రోజుల్లో ఏ పరిణామాలకు దారి తీస్తుందనే చర్చ మొదలైంది.