Site icon vidhaatha

Manipur। బిక్కుబిక్కుమంటున్న మణిపూర్‌! పెట్రోల్‌ 200 దాటింది.. అత్యవసర ఔషధాల్లేవు.. ATMల్లో నో క్యాష్‌

Manipur

విధాత: నెల రోజులుగా మయితీ, కుకి తెగల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో మణిపూర్‌(Manipur) వాసులు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. పరిస్థితి అల్లకల్లోలంగా ఉండటంతో వ్యాపారులు తమకు తోచినంత అన్నట్టుగా దోచుకుంటున్నారు. అత్యంత కీలకమైన పెట్రోల్‌ ధర అక్కడ లీటర్‌కు 200 పైనే ఉన్నది.

నిత్యావసర వస్తువులు అమ్మే దుకాణాలు ఉదయం కొద్ది గంటలు మాత్రమే తెరిచి ఉంటున్నాయి. పైగా ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ ఒక్క ఏటీఎంలోనూ క్యాష్‌ లభించడం లేదు. రెండు తెగల మధ్య ఘర్షణ.. హింస.. యావత్‌ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నది.

పొరుగు ప్రాంతాలకు తరలి వెళదామన్నా.. హైవేలన్నీ మూసేయడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మెయితీ తెగ వారిని ఎస్టీ కేటగిరీలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ.. మే మూడున ఆల్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ నిర్వహించిన నిరసన ర్యాలీతో హింస మొదలైంది.

ఈ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో 98 మంది చనిపోగా.. 310 మంది గాయపడినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఘర్షణల్లో నిరాశ్రయులైన వారికి కొదవే లేదు. వీరంతా తమ సొంత ఊళ్లకు దాదాపు వేయి కిలోమీటర్ల దూరంలోని ఢిల్లీ, డిమాపూర్‌, గువాహటి వంటి చోట్ల సహాయ కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఆఖరుకు ఈ సహాయ కేంద్రాల్లో కూడా తగిన వసతులు, ఔషధాలు అందుబాటులో లేవని బాధితులు చెబుతున్నారు.

Exit mobile version