ఆదివాసీ సంప్రదాయంతో మేడారం జాతర నిర్వహించాలి :మావోయిస్టుల డిమాండ్‌

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలతోనే నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ

ఆదివాసీ సంప్రదాయంతో మేడారం జాతర నిర్వహించాలి :మావోయిస్టుల డిమాండ్‌
  • హిందూ సంప్రదాయాలకు దూరంగా ఉంచాలి
  • జాతర తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో చర్యలుతీసుకోవాలి
  • మావోయిస్టు పార్టీ జేఎండబ్ల్యూపీ కమిటీ కార్యదర్శి వెంకటేశ్‌
  • జాతర పరిసరాల్లో వసతులు కల్పించాలని డిమాండ్‌
  • సెంటిమెంట్‌ను వ్యాపారంగా మార్చారని ఆరోపణ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలతోనే నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) జయశంకర్- మహబూబాబాద్ -వరంగల్(2)- పెద్దపల్లి (JMWP) డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్‌ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. హిందూ సంప్రదాయాలైన లడ్డు, పులిహోర లాంటివి కాకుండా బెల్లాన్ని ప్రసాదంగా ఇవ్వాలని కోరారు. జాతర ముగిసిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రభుత్వం బాధ్యత వహించి, నిధులు కేటాయించి జబ్బులు రాకుండా శుభ్రం చేయాలన్నారు. జబ్బుపడిన వారికి తగిన చికిత్స అందించాలని ఆయన సూచించారు. జాతర పనుల కోసం విడిచిపెట్టిన పంట పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలని, పంట పొలాల్లో మద్యం సీసాలతోపాటు అన్ని రకాల వ్యర్థాలనూ తొలగించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సౌకర్యాలు కల్పించడంలో విఫలం

జాతరకు వచ్చిన ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వ విఫలమైందని మావోయిస్టు నేత ఆరోపించారు. ప్రభుత్వం ముందు చూపుతో అన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నదని, కానీ.. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని విమర్శించారు. జాతరకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పనులను కాంట్రాక్టర్లకు ఇచ్చిందని, వాళ్ళు నిర్లక్ష్యంతో పనులను నత్తనడకన, నాశిరకంగా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని ఆరోపించారు. ఈ ఏడాది పడిన భారీ వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయని, వాటికి ఇప్పటి వరకూ మరమ్మతులు చేయలేదని అన్నారు. ఇప్పుడు హడావుడిగా, నిర్లక్ష్యధోరణితో రోడ్లు పోయడంతో గుంతలు అలానే ఉండిపోయాయని, రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు చనిపోతున్నారని తెలిపారు. జాతర ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇప్పటికే జాతరకు వస్తున్నవారు తిరిగి వెళ్లిపోతున్నారని తెలిపారు. పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం.. వారికి సౌకర్యాలు కల్పించకపోవడంతో నిరాశ, నిసృహలకు గురవుతున్నారని వెంకటేశ్‌ విమర్శించారు. ప్రభుత్వం పనులను వేగంగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

సెంటిమెంటును వాడుకుంటున్నారు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఆదివాసీ ప్రజలతో పాటు అన్నివర్గాల ప్రజలు వస్తారని, తల్లులను ఆరాధ్య దైవంగా పూజిస్తారని వెంకటేశ్‌ పేర్కొన్నారు. ఆదివాసీ ప్రజలపై కాకతీయ రాజులు అధిక పన్నులు విధించి వాటిని చెల్లించాలని ఒత్తిడి చేయడంతో రాజుపై సమ్మక్క, సారలమ్మలు పోరాడుతూ అసువులుబాసారన్నారు. అప్పటి నుండి ఆదివాసి ప్రజలంతా సమ్మక్క, సారలమ్మలను ఆరాధ్య దైవంగా పూజిస్తారని, వారి పోరాటాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో వారిని స్మరించుకుంటారన్నారు. ఆదివాసులలో ఉన్న ఈ సెంటిమెంటును ఆసరా చేసుకొని ఈ పండుగను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుని ఆదివాసుల పాత్రను నామమాత్రం చేసిందని విమర్శించారు.