Margadarsi |
- సమాచారం లేకుండా విదేశాలకు వెళ్లారు
- మార్గదర్శి కేసులో ఏపీ సర్కార్ వాదన
విధాత, హైకోర్టు: మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ నగదు మళ్లింపు కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆ సంస్థ ఎండీ సీహెచ్ శైలజ దర్యాప్తు అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్లారని.. అందుకే లుక్ ఔట్ నోటీసుల విషయంతో ముందుకు వెళ్లాల్సి వచ్చిందని తెలంగాణ హైకోర్టులో ఏపీ సర్కార్ వాదనలు వినిపించింది.
విచారణ సందర్భంగా సీఐడీ ఏఎస్పీలు రాజశేఖర్‌రావు, రవికుమార్ కోర్టుకు హాజరయ్యారు. వాదనలకు కొంత సమయం కావాలని న్యాయవాదులు కోరడంతో హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది. కఠిన చర్యలు చేపట్టరాదంటూ మార్చి 21న ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఎండీకి వ్యతిరేకంగా లుక్‌ఔట్ నోటీసు జారీ చేశారని మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థ ఎండీ సీహెచ్ శైలజ వేర్వేరుగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ సురేందర్ శుక్రవారం విచారణ చేపట్టారు. అనారోగ్య కారణాలతో అదనపు డీజీపీ ఎన్.సంజయ్, అధికారిక కారణాలతో ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి హరీశ్ హాజరుకాలేకపోయారని ఏపీ తరపు న్యాయవాది కైలాసనాథ్ రెడ్డి తెలిపారు.
ఈ పిటిషన్లలో కౌంటర్లు దాఖలు చేసినట్లు చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రాజశేఖర్‌రావు, రవికుమార్లకు హాజరు మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.