విమానాశ్రయాలు.. కాఫీ టీల నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ల దాకా అనేక కంపెనీల స్టోర్లు ఉంటాయి. అయితే.. ఒక విమానాశ్రయంలో మాత్రం ఎవరూ ఊహించని స్టోర్ ఒకటి వెలిసింది.
సాధారణంగా సంబంధాలు కుదుర్చుతామంటూ పలు ప్రాంతాల్లో మ్యాట్రిమోనియల్ ఏజెన్సీలు తమ దుకాణాలు తెరుస్తుంటాయి. షాదీడాట్‌కం వంటి పోర్టళ్లు వధూవరుల ఎంపికకు స్థలాలుగా ఉంటుంటాయి. అయితే.. ఒక కంపెనీ వినూత్నంగా ఆలోచించింది.
తరచూ విమానాల్లో తిరుగుండే యువతీ యువకులును లేదా పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ఏకంగా చెన్నై విమానాశ్రయంలోనే దుకాణం తెరిచింది.
అందుకు సంబంధించిన చిత్రాన్ని ఒక యువతి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇప్పుడది హల్‌చల్ చేస్తున్నది. దీనిపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఈ చిత్రం చూస్తే తనకు నవ్వాగడం లేదని, అత్యవసర పరిస్థితి వస్తే ఔషధ దుకాణం లేదు కానీ.. ఇది మాత్రం ఉన్నదంటూ.. ఫొటో పెట్టిన యువతి కామెంట్ చేసింది.
నాకు ఇంకా రెండు గంటల సమయం ఉన్నది.. చూద్దాం ఈ రెండు గంటల్లో నా లైఫ్ పార్ట్‌నర్‌ను వెతుక్కోగలనేమో.. అని ఒకరు కామెంట్ చేశారు. పెళ్లికూతురు లేదా పెళ్లికొడుకుతో ఎలాంటి సుంకాలు లేకుండా బయటకు వచ్చేయొచ్చు అని ఒకరు జోక్ చేశారు. మీలో ఎవరికైనా అలా దొరికారా? అని కొందరు ఆరా తీశారు. మొత్తానికీ ఈ మ్యాట్రిమోనియల్ సామాజిక మాధ్యమాల్లో తెగ నవ్వులు పూయిస్తున్నది.