విధాత: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని గిల్గిత్, బాల్టిస్థాన్ గత 12 రోజులుగా అట్టుడుకుతున్నది. తమ ప్రాంతాన్ని భారత్‌లోని లద్దాఖ్‌లో కలిపాలని రోడ్లమీదికి వచ్చి ప్రజలు ఉరేగింపులు తీస్తూ నినదిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పాకిస్థాన్‌లో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. గోధుమ పిండి, ఇతర నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటాయి. సబ్సిడీపై ఇచ్చే గోధుమ పిండి కోసం ప్రజలు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ఆ క్రమంలో తొక్కిసలాట జరిగి ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.
ఈ నేపథ్యంలో పీఓకేలోని ప్రజల్లో గూడుకట్టుకొన్న ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లెక్కి నిరసనోద్యమాలు చేస్తున్నారు. నిత్యావసరాలు కూడా అందించలేని సర్కారు తమకు అక్కరలేదని నినదిస్తున్నారు. భారత్‌లోని లద్దాఖ్‌లో తమ ప్రాంతాన్ని విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్, బాల్టిస్థాన్ ప్రాంతాలు అత్యంత విలువైన సహజ వనరులున్నవి. అనేక రకాలైన విస్తారమైన ఖనిజ నిక్షేపాలున్నాయి. అందుకే తమ ప్రాంతంపై పాకిస్థాన్ కన్నేసి ఆక్రమించుకొని తమను, తమ ప్రాంతాన్ని దోపిడీ చేస్తున్నదని స్థానిక ప్రజలు అంటున్నారు.
ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా వివక్షచూపుతూ అడిగితే పోలీస్ మిలట్రీతో అణిచి వేస్తున్నారని గిల్గిత్, బాల్టిస్థాన్ వాసులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పాక్‌లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం, పెరిగిన ధరల నేపథ్యంలో పీఓకేలోని ప్రజలు భారత్‌లో తమ ప్రాంతాన్ని కలపాలని డిమాండ్ చేస్తున్నారు. గత పన్నెండు రోజులుగా పీఓకే వాసులు వీధుల్లో నిరసనోద్యమాలతో పోరాడుతున్నారు.
ప్రజలు నిత్యావసరాలు అందక నినదిస్తుంటే… పాక్ ఆర్మీ ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్నది. నిరసన కారులను నిర్బంధిస్తూ జైలు పాలు చేస్తున్నది. పరిస్థితులు ఇలాగే ఉంటే… పీఓకే ప్రాంతమంతటా భారత్‌లో కలుపాలన్న డిమాండ్ మరింత విస్తరించటమే కాదు, ఉధృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.