Site icon vidhaatha

మెటా (Facebook) ఇండియా హెడ్ మ‌న ‘ఆంధ్రా’ స్టూడెంట్‌

విధాత‌: ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా యాప్ ఫేస్‌బుక్ (మెటా) ఇండియా యూనిట్ వైస్ ప్రెసిడెంట్‌గా సంధ్యా దేవనాథన్‌ను నియమించినట్లు ప్రకటించింది. మెటా స్టేట్‌మెంట్ ప్రకారం, దేవనాథన్ 2023 జనవరి 1న మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ నెల మొద‌టివారంలో మెటాకు రాజీనామా చేసిన అజిత్ మోహన్ స్థానంలో సంధ్య‌ను ఎంపిక చేశారు. ప్ర‌స్తుతం మెటా ఇండియా డైరెక్టర్‌ మ‌నీష్ చోప్రా అజిత్ మోహన్ స్థానంలో తాత్కాలికంగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.

సంధ్యా దేవ‌నాథ‌న్ ఆంధ్రా యూనివ‌ర్సిటీ విద్యార్థి కావడం గ‌మ‌నార్హం. త‌ను ఆంధ్రా యూనివర్సిటీ (1994-1998) కెమికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ , ఆ తర్వాత MBA ఢిల్లీ యూనివర్సిటీ (1998-2000)లో చేసారు. 2014లో లీడర్‌షిప్ కోర్సు కోసం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు.

ప్ర‌స్తుతం సంధ్యా దేవ‌నాథ‌న్ సింగపూర్‌లో ఉన్నారు. 2016 జనవరిలో సింగపూర్‌లో SEA – ఇ-కామర్స్, ట్రావెల్ మరియు ఫిన్‌సర్వ్‌లో గ్రూప్ డైరెక్టర్‌గా మెటా (ఫేస్‌బుక్ )లో చేరారు. 2020 ఆగస్టులో, ఆమె సింగపూర్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా, వియత్నాంకు బిజినెస్ హెడ్‌గా ప‌దోన్న‌తి సాధించారు.

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో గేమింగ్‌కు వైస్ ప్రెసిడెంట్ కూడా ప‌నిచేశారు. పెప్పర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్, నేషనల్ లైబ్రరీ బోర్డ్ (సింగపూర్), సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ (సింగపూర్), ఉమెన్స్ ఫోరమ్ ఫర్ ది ఎకానమీ అండ్ సొసైటీ వంటి సంస్థ‌ల‌కు దేవనాథన్ బోర్డు స‌భ్యురాలిగా కూడా సేవలందించారు.
ఆమె మే 2000 నుండి డిసెంబర్ 2009 వరకు సిటీ గ్రూప్‌లో వివిధ‌ హోదాల్లో పని చేసారు. డిసెంబర్ 2009 నుండి డిసెంబర్ 2015 వరకు స్టాండర్డ్ చార్టర్డ్‌తో క‌లిసి పని చేసారు.

Exit mobile version