Site icon vidhaatha

Minister Indrakaran Reddy | మాస్ట‌ర్ ప్లాన్.. డ్రాఫ్ట్ నోటిఫికేష‌న్ మాత్ర‌మే!

Minister Indrakaran Reddy | విధాత, నిర్మ‌ల్: స్థానిక మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ఫైనల్ కాదని, ఇది డ్రాఫ్ట్ నోటిఫికేష‌న్ మాత్ర‌మే అని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఏఒక్క‌రికీ అన్యాయం జ‌ర‌గ‌నివ్వమని హామీ ఇచ్చారు. ఆర్డీవో కార్యాల‌యం ఎదుట రైతుల దీక్ష శిబిరాన్ని మంత్రి మంగళవారం సంద‌ర్శించి, మాట్లాడారు. మాస్ట‌ర్ ప్లాన్ పై ఎలాంటి ఆందోళ‌న చెంద‌వ‌ద్దని అన్నారు.

ప్ర‌జ‌ల అభ్యంత‌రాలు, స‌ల‌హాలు, సూచ‌న‌లు ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటామని తెలిపారు. ప్ర‌జ‌లు, రైతుల‌కు వ్య‌తిరేఖంగా బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోదని స్పష్టం చేశారు. ప్ర‌తిప‌క్షాల మాట‌లు న‌మ్మి మీరు మోస‌పోవ‌ద్దని తెలిపారు. అనంతరం దీక్ష చేస్తున్న రైతుల‌కు మంత్రి నిమ్మర‌సం ఇచ్చి దీక్ష‌ను విర‌మింప‌జేశారు.

‘భూ ఆక్రమణ ఆరోపణలు నిరాధారం’

తాను 260 ఎక‌రాల ప్రభుత్వ భూమిని ఆక్ర‌మించిన‌ట్లు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు చేసిన ఆరోపణలు నిరాధారమని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఈ సందర్భంగా ఖండించారు. ‘నాకు ఎక్క‌డ భూమి ఉందో ప్రతిప‌క్ష నాయ‌కులు నిరూపిస్తే నేను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా. లేదంటే ఆరోప‌ణ‌లు చేసిన వారు ముక్కు నేల‌కు రాసి క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి’ అంటూ సవాల్ విసిరారు. నిజాయితీగా ఉన్నాము కాబ‌ట్టే మూడు ద‌శాబ్ధాల‌కు పైగా ప్ర‌జ‌లు మమ్మ‌ల్ని ఆదిరిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

Exit mobile version