విధాత, ప్రత్యేక ప్రతినిధి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడారం మాస్లర్ప్లాన్ పనులను జాతర ప్రారంభానికి ముందే పూర్తి చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి సీతక్కలు స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. పనుల పురోగతిని పెంచేందుకు అవసరమైతే పనిచేసే వారి సంఖ్యను పెంచాలని సూచించినట్లు చెప్పారు. జాతర నాటికి పనులు పూర్తి చేసే పేరుతో నాణ్యతలో ఎలాంటి రాజీపడకూడదని మంత్రులు తేల్చిచెప్పారు. శాశ్వత ప్రతిపాదికన పనులు చేపడుతున్నందున ఈ అంశానికి తగిన ప్రాధాన్యతనిస్తున్నట్లు వివరించారు. మేడారాన్ని సందర్శించిన సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు. మంగళవారం ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారానికి హెలికాప్టర్ లో చేరుకున్నారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ లకు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్.పి. సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐటిడిఏ పి ఓ చిత్ర మిశ్రా, భూపాల పల్లి ఎస్.పి. సిరిశెట్టి సంకీర్త, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్ పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అనసూయ సీతక్కలకు స్వాగతం పలికారు. తదుపరి శ్రీసమ్మక్క సారలమ్మ దేవాలయానికి చేరుకుని వనదేవతలను సందర్శించి పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి మేడారం లో చేపడుతున్న అభివృద్ధి పనులను వారు పరిశీలించారు.
శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంతో పాటు మేడారంలోని చిలుకలగుట్ట రోడ్డు, స్తూపం, కన్నెపల్లి, జంపన్నవాగు, ఆర్.టి.సి. బస్ స్టేషన్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. అనంతరం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు పూర్తయిన పనులు, పర్యవేక్షన రానున్న రోజుల్లో ప్రణాళిక తదితర అంశాలపై అధికారులు వివరించారు. ఇప్పటి వరకు సాగుతున్న పనులు, రానున్న రోజుల్లో చేపట్టనున్న పనుల పై చర్చించారు. జాతర నాటికి పనులు పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జాతర నేపథ్యంలో ఇప్పటికే భక్తుల తాకిడి పెరిగిందని, రానున్న రోజుల్లో ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా భక్తుల దర్శనానికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
ఇవి కూడా చదవండి :
100 Weekend Wonders Contest : బంపర్ ఆఫర్..పర్యాటక ప్రాంతాలు పంపితే నగదు బహమతులు
Burugupally Sarpanch : కొత్త సర్పంచ్ సంచలన నిర్ణయం..ఒక్క రూపాయికే దహన సంస్కారాలు..!
