Sreeleela | యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ హిట్స్ కంటే ఫ్లాపులు ఎక్కువ కావడంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆమె, ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అవుతోంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే, ఇటీవల శ్రీలీల చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ‘జూబిలేషన్’ ఫెస్ట్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ తన స్పీచ్‌తో వారిలో ఉత్సాహం నింపారు. చిన్నప్పుడు నరసరావుపేటకు వచ్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, మళ్లీ కాలేజ్ ఫెస్ట్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే ఒంగోలు తన అమ్మమ్మ, తాతయ్యల ఊరని చెప్పడంతో స్టూడెంట్స్ నుంచి భారీగా చప్పట్లు వినిపించాయి.
చదువుపై దృష్టి పెట్టాలని, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగాలని ఆమె ఇచ్చిన సూచనలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో స్టేజ్‌పై మాట్లాడుతూ “మిమ్మల్ని చూసిన జోష్‌లో అరిచి అరిచి గొంతు పోయింది” అంటూ నవ్వించారు. అదే సమయంలో కింద ఉన్న కొందరు విద్యార్థులు “డాన్స్… డాన్స్…” అంటూ గట్టిగా అరవడంతో, శ్రీలీల అసహనం చూపకుండా చిరునవ్వుతో స్పందించారు. “నిజంగా పెళ్లాన్ని అడిగినట్టు అడిగారు… సరే డ్యాన్స్ చేద్దాం రండి” అంటూ చమత్కారంగా రిప్లై ఇచ్చారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉత్సాహంతో నిండిపోయింది. అనంతరం స్టూడెంట్స్‌తో కలిసి స్టెప్పులు వేయడంతో ఆ ఫెస్ట్ హైలైట్‌గా మారింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. “ఇదే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్”, “స్టార్ అయినా ఎంత డౌన్ టు ఎర్త్”, “యూత్ క్రష్ అంటే ఇదే” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, పబ్లిక్ ప్లేస్‌లలో సెలబ్రిటీలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించే వర్గం కూడా ఉంది. ఏదేమైనా, ఈ సంఘటనను శ్రీలీల చాలా పాజిటివ్‌గా తీసుకుని తన చమత్కారంతో వాతావరణాన్ని లైట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది.
ఇక ఆమె సినీ ప్రయాణం విషయానికి వస్తే, ‘పెళ్లి సందడి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల, ‘ధమాకా’తో భారీ బ్లాక్‌బస్టర్ అందుకుని కెరీర్‌లో మరో మెట్టు ఎక్కింది. బాలకృష్ణతో చేసిన ‘భగవంత్ కేసరి’లో ఆమె పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. మధ్యలో కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా, అవకాశాల విషయంలో మాత్రం ఆమెకు ఎలాంటి కొరత లేదు. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, హిందీ ఇండస్ట్రీల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ముందుకు సాగుతోంది.
